Nov 01,2021 09:33

ప్రపంచమెప్పుడో నాగరీకత నేర్చుకుందట
ఆమె అక్కడే ఉండిపోయింది
అమ్మతనాన్ని పెనవేసుకుని

దాచుకున్న నెమలి పింఛమింకా అలాగే ఉంది
కళ్లుమూసి తెరిచేలోపే
బాల్యం వలసెళ్లిపోయింది
గిల్లికజ్జాలాటలింకా కళ్లెదుటే దాగుడుమూతలాడుతున్నాయి
పిచ్చుకగూళ్లు ఇసుక చెవిలో
రహస్యాలు చెప్పిపోతున్నాయి

సముద్రం ఎంతకీ తగ్గనంటూ
హోరుహోరున శబ్దం చేస్తోంది
జీవితమెంత దుఃఖాన్ని మోసినా
ఏ ఒక్క సాక్ష్యమూ మద్దతుగా నిలబడదు

చావు పల్లకిలో ఊరేగుతూ
అతను వెళ్లిపోయాడు
గాజులు, పువ్వుల నిండా రక్తపు మరకలు
ఇంతగా గాయపరిచిందెవరో?!
నుదురు బోసిపోయింది

తెలతెలవారుతుండగా
ఆమె నొసటనే ఉదయించాడు సూర్యుడు
ఆమె విధవని శంకించలేదు
ఎన్నో రాత్రులు ఆమె శరీరాన్ని
అంటి పెట్టుకునే ఉంది నేల
భూమికెలాంటి కీడు జరగలేదు
ఆమె నాసికా పుటాలు విడిచిన గాలి
పచ్చని చెట్టయ్యి
మరింత నేలలో పాతుకుపోయింది

పొరపాటున అద్దంలో కనిపించే
ఆమె ప్రతిబింబాన్ని కూడా
ముక్కలు చేసే సంస్క్రృతినెందుకో
ఇంతగా నెత్తిన మోస్తుందీ సమాజం

ఈ తోడేళ్ల ప్రపంచంలో
ఆమె ఒంటరిగా బతకాలంటే
పదునైన కత్తిపై నిలబడి
ఒంటరి యుద్ధం చేయాల్సిందే
అపహాస్యాల్ని చిటికెన వేలి గోటితో
పక్కకు విసరాల్సిందే

నాగరికపు ప్రపంచమంతా
మగత నిద్రలోనే ఉంటుందెప్పుడూ
ఆమె మాత్రం
ఓ ప్రశాంత మెలకువను కలగంటూ!

వైష్ణవిశ్రీ
80742 10263