Jun 30,2021 06:55

    కోవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత. మానవతా దృష్టితో చూసినా ఈ సంక్షోభ సమయంలో వారికి అండగా నిలవడం అత్యంతావశ్యకం. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయం. వలస కార్మికుల సమస్య దగ్గర నుంచి కోవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు దాకా మోడీ ప్రభుత్వ ధోరణి ఒక్కటే. ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని అది చెప్పదలచుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రకటించిన రూ. 6.1 కోట్ల ఉద్దీపనా ప్యాకేజీలో రుణాలకు సంబంధించిన ఘోష తప్ప సామాన్యులకు మేలు చేకూర్చే కొత్త అంశం ఒక్కటీ లేదు. కోవిడ్‌ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల పరిపరిహారం చెల్లించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే అలా పరిహారం చెల్లించడం కుదరదని కేంద్రం నిర్లజ్జగా చెప్పింది. అలా చెల్లించడం మొదలెడితే విపత్తునిధి అంతా దీనికే ఖర్చు అయిపోతుందని, అప్పుడు వ్యాక్సిన్‌, ఇతర కోవిడ్‌ సంబంధిత ఖర్చులకు డబ్బులే వుండవని పసలేని వాదనలను ముందుకు తెచ్చింది.
     వయోజనులందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించే విషయంలోనూ మొదట ఇలాగే మొండికేసింది. సుప్రీంకోర్టు గట్టిగా చీవాట్లు పెట్టడం, రాష్ట్రాల నుంచి ఒత్తిడి తీవ్రతరం కావడంతో అయిష్టంగానే అందుకు అంగీకరించింది. ఏడాదికాలంగా జీవనోపాధి కోల్పోయి మనుగడ సాగించడమే దుర్లభంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌ మూలంగా చనిపోయిన వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? నాలుగు లక్షల కరోనా మృతుల కుటుంబాలకు నాలుగేసి లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు మహా అయితే రూ.16వేల కోట్లు అవసరమవుతాయి. దీనికి డబ్బుల్లేవని చెప్పడం నయవంచనకు పరాకాష్ట. వనరుల సమీకరణకు అవకాశాలు అనేకం ఉన్నా వాటిని వదిలిపెట్టి పేదలకు ఉద్దేశించిన సంక్షేమంపై కోత పెడుతున్నది. బడా కర్పొరేట్‌ సంస్థలకు 11.5లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేసినప్పుడు, 2021-22 బడ్జెట్‌లో సంపన్నులకు 65 వేల కోట్ల రూపాయల మేర పన్ను రాయితీలిచ్చినప్పుడు వనరుల కొరత గుర్తుకు రాలేదు. సెంట్రల్‌ విస్తా నిర్మాణం కోసం రూ. 20వేలకోట్లు, విగ్రహాల కోసం 9వేలకోట్లు, మోడీ విమానాల్లో చక్కర్లు కొట్టడం కోసం 8,400 కోట్లు, ప్రకటనల కోసం 6వేలకోట్లు వెచ్చించినప్పుడు డబ్బు సమస్య రాలేదు. కోవిడ్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలనేసరికి వనరుల కొరత గుర్తుకొస్తున్నది. మోడీ ప్రభుత్వ వర్గ నైజానికి ఇదొక తార్కాణం. కరోనా సంక్షోభ కాలంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 జీవన భృతి కల్పించాలని ప్రజలు వీధుల్లోకి వచ్చి గొంతెత్తినా పట్టించుకోలేదు. అదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కరోనా సమయంలో సైతం విపరీతంగా పెంచేసింది. 2014నుంచి ఇప్పటివరకు రూ. 3.1లక్షల కోట్ల మేర పెట్రో భారాన్ని ప్రజలపై మోపింది. ఇంతటి అమానవీయ ప్రభుత్వం స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో ఇదివరకెన్నడూ మనకు కానరాదు.
    గత ఆదివారం మన్‌కీబాత్‌లో ప్రధాని మాట్లాడుతూ, సైన్స్‌ను, సైంటిస్టులను నమ్మండి, పుకార్లు నమ్మొద్దు. కరోనా వ్యాక్సిన్‌ అందరూ వేయించుకోండి అని హితవు పలికారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మందకొడిగా సాగడానికి వ్యాక్సిన్‌ పట్ల్ల ప్రజల్లో అపోహలే కారణమన్నట్లుగా చెప్పడం మరీ దారుణం. వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవసరానికి తగినట్లుగా పెంచే అవకాశమున్నా ప్రభుత్వం ఆ పని చేయకుండా కార్పొరేట్ల లాభాలకు గ్యారంటీ చేయడమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పటివరకు రెండు డోసులు అందినవారు 5.6శాతానికి మించి లేకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం రకరకాల జిమ్మిక్కులు చేస్తోంది. ఈ ప్రభుత్వానికి సైన్స్‌ పట్ల, సైంటిస్టుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని హేళన చేసిన రాందేవ్‌ బాబా వంటివారిని వెనకేసుకొచ్చేది కాదు. విద్య, పరిశోధనా రంగాల గురించి తెలియని వ్యక్తిని విద్యా శాఖ మంత్రిగా పెట్టి ఉండేది కాదు. ఇటువంటి అమానవీయ, మోసకారి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత త్వరగా సాగనంపితే దేశానికి అంత మంచిది.