Jun 30,2023 23:17

యజమానులకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు, కార్మికులు

గుంటూరు: గుంటూరు ఆటో నగర్‌లోని అరుణ్‌ మెటల్‌ ,విజయదుర్గా మెటల్‌, గార్లపాటి మెటల్‌, భార్గవ మెటల్‌ అల్యూమినియం కంపెనీలలో పని చేస్తున్న కార్మికులకు జీతాలు, కూలి రేట్లు పెంచాలని కోరుతూ యజమానులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత ఒప్పందం మే నెలలో ముగిసిందని, కొత్త జీతాలు, కూలిరేట్ల ఒప్పందం చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, కార్మికుల జీతాలు మాత్రం పెంచకుండా, పాత రేట్లే అమలు చేస్తామంటే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అలాగే అదేవిధంగా కంపెనీలో పనిచేసే కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలైన పిఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు కావట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సరే యజమానులు చొరవ చూపి వెంటనే జీతాలు, కూలి రేట్లు పెంచాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సాంబశివరావు, సిహెచ్‌ శ్రీనివాస రావు, కోశాధికారి దయానందం, కార్మికులు పాల్గొన్నారు.