ప్రజాశక్తి - ఆరిలోవ : పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనాన్ని పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కృషి చేయాలని ప్రభుత్వాలు ప్రజలకు చెబుతుంటే.. మరోవైపు పచ్చగా ఉండే గ్రీన్ బెల్ట్‌లో చల్లని నిడనిచ్చే చెట్లును యథేచ్ఛగా నరికేస్తున్నారు. బిఆర్‌టిఎస్ రోడ్డు పెదగదిలి, సంజరుగాంధీ కాలనీ వద్ద గ్రీన్ బెల్టులో పదుల సంఖ్యలో చెట్లును నరికేసారు. బిఆర్‌టిఎస్ రోడ్డును ఆనుకొని సాయిబాబా ఆలయం ఉంది. ఆలయం ముందు గ్రీన్ బెల్టులో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు ఉన్నాయి. ఆలయం సరిగా కనిపించలేదని నిర్వాహకులు పచ్చని చెట్లును నరికేసారు. సాధారణంగా ఆలయాల ముందు, చుట్టు పక్కల పచ్చదనం కోసం, భక్తులు సేదతీరేందుకు మొక్కలు పెంచుతారు. ఇక్కడ మాత్రం ఉన్న పచ్చదనాన్ని నాశనం చేయడం విడ్డూరంగా ఉంది. ఆలయం ఎదురుగా కారిడార్‌లో ఉన్న సుమారు 30 నుంచి 40 వరకు బాగా పెరిగిన మొక్కలను ఆలయ నిర్వాహకులు తొలగించారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సచివాలయ సిబ్బందికి స్థానికులు ఫిర్యాదు చేసినా చెట్లు నరకడం ఆపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనాన్ని నాశనం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










