ఆలయాల్లో కార్తీక శోభ
- శ్రీశైలం, మహానంది క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
- మహానందిలో భక్తులకు నీడ వసతి కరువు - ఎండలోనే పూజా కార్యక్రమాలు
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలను వెలిగించి, అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు తెల్లవారు జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి భక్తులకు దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేశారు. తెల్లవారు జామున 4 గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు, అలాగే సాయంకాలం ఐదున్నర గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు స్వామి అమ్మవార్లకు దర్శనానికి ఏర్పాటు చేశారు. భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు. క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పరిపాలన భవనం సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు కేటాయించారు. దేవస్థానం ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ తదితరులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా లక్షదీపోత్సవం, దశ విద హారతులను నిర్వహించారు.
అన్న ప్రసాద వితరణకు విరాళం : శ్రీశైలం దేవస్థానం భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్న ప్రసాద విత్తనానికి కార్తీక మాసం సందర్భంగా సోమవారం తాడిపత్రికి చెందిన జి.కరుణాకర్ రెడ్డి రూ.1,00,116లు విరాళంగా అందజేశారు. దాతకు శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మహానందిలో భక్తులకు వసతులు కరువు
మహానంది : ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, కోనేరులలో, ధ్వజస్తంభం వద్ద కార్తీకదీపం వెలిగించి స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకున్నారు. అలాగే క్షేత్రంలో కేదారేశ్వర స్వామి నోములు కూడా భక్తులు నిర్వహించుకున్నారు. కేదారేశ్వర వ్రత నోములు నోచుకోవడానికి రూ. 200 ఇచ్చి ఎండలో కూర్చొని చేసుకోవాల్సి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు ఆదాయం పైనే కాక వసతుల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని భక్తులు మండిపడుతున్నారు. స్వామి వారి దర్శనానికి ప్రత్యేకంగా రూ. 50, రూ. 150, రూ.200 టికెట్లు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అయితే భక్తులకు నీడ వసతి కల్పించేందుకు షామియనానాలు వేయడంలో ఒకరిపై ఒకరు చెప్పుకోవడం, దాతల కోసం ఎదురుచూపులు చూడడం తప్ప దేవస్థానం తరపున సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికైనా ఆలయ ఆదాయం కోసం కాకుండా వసతుల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.