ప్రజాశక్తి - శృంగవరపుకోట : ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు కొట్టం కోటమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం పడకేసింది. ఆలయ దర్శనం నిమిత్తం వచ్చిన భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయి. కొట్టం కోటమ్మతల్లిని దర్శించుకునేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి అధిక ఆదాయం వస్తుంది. అయినా ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవారి దర్శనం, మొక్కులు తీర్చుకునే నిమిత్తం ప్రతి ఆది, మంగళ వారాలు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. భక్తులు కనీస అవసరాల నిమిత్తంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటికి తోడు చుట్టు పక్కల పరిసరాలు చెత్తా చెదారాలతో నిండి వర్షం కురిసినప్పుడు దుర్గంధం వెదజల్లుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు భక్తుల నుండి కానుకల రూపంలో వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేయడంలోనూ, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలోనూ లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకమండలితో పాటు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి ఇప్పుడు మరుగుదొడ్లు నిర్మించారంటే భక్తుల మీద ఎంత అశ్రద్ధ వహిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. కోట్ల ఆదాయం వస్తున్న అమ్మవారికి కోనేరు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. దేవాదాయ శాఖ ఇకనైనా స్పందించి అమ్మవారి దేవాదాయ భూములను కోనేరును రక్షించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఆడవాళ్లకు తప్పని పాట్లు
అమ్మవారి దేవాలయం వద్ద నేటి వరకు కనీసం మరుగుదొడ్లు సౌకర్యం కూడా కల్పించలేదు. ఇటీవల నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటిని ప్రారంభించకుండా తాళాలు వేసి ఉంచారు. ఈ అమ్మవారి ఆలయం వద్ద ఆడవారికి సౌకర్యాలు లేవనే చెప్పాలి.
మేడ శెట్టి సింహాచలం, శృంగవరపుకోట
పరిసరాలను శుభ్రం చేయిస్తా
ఆలయ పరిసరాలు దుర్గంధంగా ఉన్నమాట వాస్తవమే. కానీ వాటిని శుభ్రం చేయిస్తాం. మరుగుదొడ్లను నూతనంగా నిర్మించాం. మంగళ, ఆదివారాలలో వాటిని భక్తులు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి వాడుక నీటికి ఇబ్బందులేదు.
ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగేంద్ర










