ప్రజాశక్తి-మాడుగుల:నియోజకవర్గంలోని దేవరాపల్లి మండలంలో బోయిల కింతాడ గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణానికి అనకాపల్లికి చెందిన ఎంవీఆర్ ట్రస్ట్( ముత్యాల వెంకటేశ్వరరావు )ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించడంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా గ్రామస్తులు ఆలయ నిర్మాణానికి విరాళాలు పోగు చేసి నిర్మాణం ప్రారంభించినా ఆర్థిక సమస్యలతో మధ్యలో ఆగడంతో అనకాపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావును సంప్రదించారు. ఆయన ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు అంగీకారం తెలిపారని గ్రామస్తులు శనివారం తెలిపారు. కొద్ది కాలం కిందట తమ సమీప గ్రామానికి ముత్యాల వెంకటేశ్వరరావు అంబులెన్స్ సదుపాయం కల్పించారని, గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలకు సైతం సహకారం అందిస్తున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవిఆర్ సేవా ట్రస్ట్ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జులు అప్పలనాయుడు, ప్రణీత పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.










