ప్రజాశక్తి - గరుగుబిల్లి : మండలంలో నాగూరులో గల చంద్రశేఖర స్వామి దేవాలయ భూమి ఆక్రమణకు గురవుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా దేవాదాయ శాఖ వారి పరిధిలో ఉన్నప్పటికీ ఈ దేవాలయం వైపు అధికారులు కన్నెత్తి చూకపోవడంతో ఆలయ భూములకు రెక్కలొచ్చాయి. ఈ దేవాలయానికి సంబంధించి మెట్టు, పల్లం భూములు కలిసి సుమారు మూడెకరాలున్నాయి. ఈ భూములను 2016 -17లో లీజు కోసం వేలంపాట కార్యనిర్వాహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి గణేష్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అప్పుడు ఎవరు వేలం పాట పాడుకున్నారో వారి ఆధ్వర్యంలోనే ఇప్పటికీ భూములు సాగులో ఉన్నాయి. లీజు సమయమై ఐదేళ్లయినా అధికారులు దేవాదాయ శాఖకు ఎలాంటి రుసుము చెల్లించకుండా సాగులో ఉంచుకున్నారు. అలాగని దేవాదాయ శాఖ అధికారులు మళ్లీ వేలంపాట నిర్వహించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా దేవాలయానికి చెందిన సుమారు ఎకరా విస్తీర్ణం కలిగిన జంగంమడిని ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. ఈ విషయమై అధికారుల దృష్టికి వెళ్లినా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ జిల్లా అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టిన వారిపై సంబంధిత అధికారులు తగు చర్య తీసుకోవాలని కోరుతున్నారు. దేవుడు భూమికి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల భూములకు రక్షణ ఏముంటుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఆక్రమణలు తొలగించే అధికారం దేవాదాయ శాఖకు ఉంది
2018లో హైకోర్టులో దేవాదాయ శాఖకు సంబంధించి వెలువడిన తీర్పులో లీజులు, కౌలు, ఆక్రమణకు సంబంధించి అనేకమైన కొత్త సవరణలు చేయడం జరిగింది. 83వ సెక్షన్ ప్రకారంగా లీజు గానీ, కౌలుకు, కాలం చెల్లిన వాటిని వెంటనే తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేసుకునే చట్టాన్ని తయారు చేసింది. ఆక్రమణలు జరిగితే దేవాదాయశాఖ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకునేలా చట్టం అవకాశం కల్పించింది. వారం రోజులు ముందుగా నోటీసు ఇచ్చి స్థలాలను ఖాళీ చేయించి భూములను రక్షించుకునే హక్కు కల్పించింది. అయినా దేవాదాయశాఖ అధికారులు చూసీ చూడనట్టు ఉండడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. వేలంపాట వేసి భూమి నుండి వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయాలి. అలాగే వేలం పాటలో అర్హత సాధించిన వారికి అప్పగించాలి.
కేతిరెడ్డి అశోక్, న్యాయవాది.
ఉన్న స్థలాన్నైనా కాపాడండి
దేవాలయానికి సంబంధించిన జంగం మడి భూమి ఆక్రమణకు గురైంది. ఇప్పటి వరకు సుమారుగా 80సెంట్లు విస్తీర్ణం కలిగిన భూమి ఆక్రమణకు గురైంది. మిగిలిన 40 సెంట్లు భూమిని దేవాదాయ శాఖ దృష్టి పెట్టి కబ్జా కోరల నుంచి కాపాడాలి. ఈ ఆలయ వ్యవహా రాలను దేవాలయ శాఖ ఆధీనంలో తీసుకోవాలి.
అక్కినేని మధుసూదన్ రావు, టిడిపి మండల నాయకులు
ఈ ఆలయం నా పరిధిలో లేదు
ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు జిల్లా ఇన్స్పెక్టర్ అప్పాజెప్పడం జరిగింది. గతంలో వేలం వేయడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలియదు.
బుద్ధ మహాలక్ష్మి గణేష్, కార్యనిర్వహణ అధికారి










