
ప్రజాశక్తి-హిందూపురం : ఆలయ భూములను పరిరక్షించాలంటూ పట్టణంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నా ఆలయ భూమిలో కొందరు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం పట్టణ నడిబొడ్డులో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయ భూములు ఇటీవల కొందరు కబ్జా చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎంతోకాలంగా ఆ స్థలాల్లో దేవాదాయ శాఖ అధికారులు అనుమతితో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తప్పుడు పత్రాలను సష్టించి కొంత మంది కోట్లాది రూపాయాలు విలువ చేసే భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయ ఈవో నాగేంద్ర సైతం అక్కడికి వచ్చి ఆందోళనకు మద్దతు పలికారు. ఆలయాల భూముల పరిరక్షణ కోసం ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. లేపాక్షి రోడ్డులోని నానెప్ప నగర్ డిబి కాలనీ మధ్య లో గల అనంత పద్మనాభ స్వామి దేవాలయంకు చెందిన రెండు ఎకరాలు పైన గల స్థలం సుమారు రూ.40 కోట్ల విలువ చేస్తుందని చెప్పారు. అనంత పద్మనాభ స్వామి ఆస్తిని కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి, వెంకటేష్, చంద్ర, ఇమ్రాన్ తదితర దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.