ముద్దనూరు : మండలంలోని పెద్దదుద్యాలలో శ్రీవరద రాజస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములకు గురు వారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఉద్రిక్తత నెలకొంది. ఆల యానికి సంబంధించి ముద్దనూరు, తొండూరు, సింహాద్రిపురం, ప్రొద్దుటూరు మండలాల్లో ఉన్న 172 ఎకరాల భూములను మూడేళ్లు కౌలుకు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వందేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను వేలం వేయవద్దని గ్రామస్తుల అభ్యంతరం తెలిపారు. ఒక వర్గం వేలం నిర్వహిం చాలని మరో వర్గం వేలం నిర్వహించకూడదని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలం అడ్డుకునేందుకు యువకుడు పెట్రోల్ తాగి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు మహిళలు పోలీసుల ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. టిడిపికి మద్దతు తెలుపినందుకు కక్ష్య సాధింపుగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రోద్బలంతో వేలం నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపణ చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య వేలం పాట కొనసాగించారు.










