ప్రజాశక్తి-హెల్త్ యూనివర్సిటీ: ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక అల్ట్రాసౌండ్ పరిజ్ఞానంతో అద్భుత ప్రయోజనాలు లభిస్తున్నాయని అమెరికాలోని మేయో క్లినిక్ అనస్థీషియా నిపుణులు డాక్టర్ హరి కలగర అన్నారు. విజయవాడ అనస్థీషియా అసోసియేషన్, విజయవాడ క్రిటికల్ కేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాల గురువారం ప్రారంభమైంది. తాడిగడపలోని కామినేని హాస్పిటల్స్‌లో జరుగుతున్న ఈ వర్క్ షాప్ లో భాగంగా పోకస్ పేరుతో నిర్వహించిన తొలిరోజు సదస్సును ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా (ఐఎస్‌ఏ) ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.వి.భీమేశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు వంద మంది అనస్థీషియా నిపుణులు పాల్గొన్న ఈ సదస్సులో అనస్థీషియా రంగానికి సంబంధించి నూతన ఆవిష్కరణలు, అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సా విధానాల గురించి చర్చించారు. డాక్టర్ హరి కలగర ప్రసంగిస్తూ ఆధునిక చికిత్సా విధానాలను అవలంభించడం ద్వారా పేషేంట్లకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్సలు అందించడం సాధ్యపడుతుందన్నారు. కార్యశాలకు సారథ్యం వహిస్తున్న ప్రముఖ అనస్థీషియన్ డాక్టర్ రాజగోపాల్ మాట్లాడుతూ అత్యాధునిక అల్ట్రాసౌండ్ పరిజ్ఞానం ద్వారా నిమిషాల వ్యవధిలో సమస్యను గుర్తించవచ్చని, అత్యవసర చికిత్స అందించే సమయంలో పేషేంటును నిర్ధారణ పరీక్షల కోసం ఎక్కడికీ తరలించే అవసరం లేకుండానే సమస్యను గుర్తించవచ్చని వివరించారు. రక్తం గడ్డ కట్టిన స్థానాన్ని గుర్తించడమే కాకుండా, ప్రమాదాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినప్పుడు రక్తస్రావం ఏ స్థాయిలో జరిగిందనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించవచ్చని వెల్లడించారు. ఈ ఆధునిక పరిజ్ఞానం ద్వారా చికిత్సలో ఆలస్యం లేకుండా చూడవచ్చని, త్వరితగతిన చికిత్స అందించడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడే అవకాశాలు మెరుగుపడతాయని తెలియజేశారు. వర్క్ షాప్‌లో రెండోరోజైన శుక్రవారం అల్ట్రాసౌండ్ గైడెడ్ రీజనల్ అనస్థీషియా (యుజిఆర్‌ఏ) సెషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ వినతి, కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ వెనిగళ్ల నవీన్, క్లస్టర్ హెడ్ పి.సునీల్ తదితరులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.










