పాఠశాలలు తెరిచేనాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - చాట్రాయి
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలో ఆయన నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్రన్‌తో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు నిర్ధిష్టకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని పోలవరం గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన బహుళార్ధకసాధక భవనాన్ని పరిశీలించారు. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించ కపోవడంపై సంబంధిత పంచాయతీరాజ్ ఎఇ, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చాట్రాయిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు కింద చేపట్టిన ఆధునికీకరణ పనులను కలెక్టర్ తనిఖీచేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల తెరిచే నాటికి తప్పనిసరిగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పక్కనే ఉన్న శిథిల భవనాన్ని తొలగించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. నరహింహరావుపాలెంలో గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. జగనన్న కాలనీకి సంబంధించిన పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. చనుబండలో అమృత సరోవర్ పథకం ద్వారా చేపట్టిన చెరువును కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సిహెచ్.విశ్వనాథరావు, ఎంపిడిఒ కె.దుర్గాప్రసాద్, ఎపిఒ జి.లక్ష్మీకుమారి, ఇఒపిఆర్‌డి నాగరాజు, సర్పంచి జ్యోతి, స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జి.రాము, ఎంపిడిఒ కార్యాలయ ఎఒ ఎన్.మురళీమోహన్ పాల్గొన్నారు.










