ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఎఇఆర్‌ఒలు స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ పరిస్థితిని, సమస్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా తప్పుడు నివేదికలు ఇచ్చినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఇతర అంశాలపై పలు మార్గ నిర్దేశకాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని ఓటర్ల జాబితా తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ విసి హాలు నుంచి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎస్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ప్రత్యేక ఉప కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎలక్షన్ సెల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ఓటర్ల జాబితాను రూపొందించాలని, తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఒకే ఇంటి చిరునామాతో పలు ఓట్లు నమోదు అయిన విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి సరైన పరిష్కారాలు చూపాలని ఆదేశించారు. ఎన్నికలు, ఓటర్ల జాబితా ప్రక్రియకు సంబంధించి విధుల్లో ఎవరు అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డిఆర్‌ఒ ఎస్.డి. అనిత, ప్రత్యేక ఉప కలెక్టర్లు దొర, వెంకటేశ్వర్లు, ఆర్‌డిఒలు సూర్యకళ, అప్పారావు, విజయనగరం తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










