ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో ఎన్టీఆర్ కళాప్రాంగణంలో కొనసాగుతున్న పరుచూరి రఘుబాబు స్మారక 31వ అఖిల భారత నాటక పోటీలు ప్రేక్షకులకు అలరింప చేస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలు మంగళవారం మూడో రోజు కొనసాగాయి. ముందుగా విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి 'సిరి మింగిన వెలగపండు' అనే నాటిక ప్రదర్శించబడింది. ప్రజాస్వామ్యంలో రాజకీయం, పరిపాలన, న్యాయస్థానాలు, జర్నలిజం అనే నాలుగు స్తంభాలు. కానీ నేడు ఈ నాలుగు డబ్బుకు దాసోహమై సమాజాన్ని భిన్నాభిన్నం చేస్తున్నాయి. స్వతంత్ర భారత దేశంలో ఓ పోలీస్ అధికారి రాజకీయ నాయకుడికి బానిసై అతను చెప్పుచేతల్లో డబ్బుకు లాగి జైలు పాలై జీవితాన్ని ముగించుకున్న వ్యక్తి గాథ. వెలగ పండును ఏనుగు మింగి వదిలిన తరువాత దానిని పగుల కొడితే లోపల ఏమి ఉండదు. అదే రీతిలో నేటి సమాజ వ్యవస్థ సిరిమింగిన వెలగపండులా కనిపిస్తుందని కథ సారాంశం. రచన శ్రీశైలమూర్తి, దర్శకత్వం మోహన్ సేనాపతి రూపకల్పనలో కొనసాగింది. అలాగే అభయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రపస్థ నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. ప్రతి మనిషి జీవితం అందంగా, ఆదర్శంగా ఎదగాలంటే అందుకు చేయూతనందించేది నాన్న నాన్న లేని కుటుంబం అంధకారంగా ఉంటుంది. చెయ్యిచి పైకి లేపేది నాన్నే. ఆలాంటి తండ్రి గాదె ఈ ఇంద్ర ప్రస్థానం నాటిక. కాగా ఈ పోటీలను పరుచూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం వ్యాఖ్యాతగా తెనాలికి చెందిన ఐనాల మల్లేశ్వరరావు వ్యవహరించారు.










