May 02,2023 23:36

సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు

ప్రజాశక్తి -మధురవాడ : మధురవాడ ప్రాంతంలోని 7వ వార్డు పరిధి ద్రోణంరాజు కల్యాణ మండపంలో మేడే వారోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్మికులు, వారి పిల్లలు వివిధ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అభ్యుదయ గీతాలు ఆలపించడంతో పాటు, కార్మిక, అభ్యుదయ, జానపద గీతాలకు చేసిన నృత్యాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. వంటగ్యాస్‌ ధరలు పెంపుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణపై స్కిట్లు, చిన్నచిన్న నాటికలు వేసి ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనలు మల్లయ్యపాలెం, పరదేశిపాలెం, కొమ్మాది ఎస్‌సి కాలనీ నుంచి వచ్చిన కళా కారులు ప్రదర్శించారు. వీరికి బి.పుణ్యవతి, డి.ఉమాశైలజ, కె.తేజు శిక్షణ ఇచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ, ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులు కళా ప్రదర్శనలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న బాలలను, కార్మికులను అభినందించారు. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి జరుగుతోందన్నారు. కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణాలర్పించి 8 గంటల పని దినం సాధిస్తే నేటి బిజెపి పాలకులు కార్మికులతో 12 గంటలు పని చేయించుకోవచ్చని చెపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులను కాపాడుకునేందుకు రానున్న రోజుల్లో మే డే స్ఫూర్తితో కార్మికులు, ప్రజలు ఉద్యమాల బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రాజుకుమార్‌, డి.కొండమ్మ, ఇతర సంఘాల నాయకులు జి.కిరణ్‌, ఎస్‌.రామప్పడు, సిహెచ్‌.శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.