ప్రజాశక్తి - అద్దంకి
సృజన వార్షికోత్సవ సభలో కవిసమ్మేళనం జరిగింది. శతావధాని శ్రీమాన్ నారాయణం బాల సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేశారు. కవి సమ్మేళనాన్ని ప్రముఖ కవి షేక్ కరీముల్లా ప్రారంభించారు. ఆరు ఆవృత్తాలలో 60మంది కవులు తమ కవితాగానంతో సభికులను అలరించారు. ఈ కవి సమ్మేళన ఆవృత్తాలను ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కుందుర్తి స్వరాజ్య పద్మజ, పాలపర్తి జ్యోతిష్మతి, డాక్టర్ యు దేవపాలన, కెఎస్‌వి ప్రసాదు, వడలి, మూడమంచు వెంకటేశ్వర్లు, జివి మాల్యాద్రి, ఆర్‌వి రాఘవరావు, ఇలపావులూరి శేషతల్పశాయి నిర్వహించారు. కవిసమ్మేళనాల తర్వాత ఓ అరగంట మాట్లాడుకుందాం కార్యక్రమంలో పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి రచించిన సృజనసాహితీ వైభవం గ్రంథాన్ని గురించి సవిస్తారంగా ఆర్ రాఘవరెడ్డి ప్రసంగించారు. సృజన ఆవిర్భావం నుండి నేటి వరకు జరిగిన సాహిత్య సమావేశాల గురించిన సమస్త సమాచారాన్ని తేదీలతో సహా ఈ పుస్తకంలో వివరించడం ద్వారా అద్దంకి సాహిత్య చరిత్రను ముందుతరాలకు అందించిన ఘనత సృజన పూర్వాధ్యక్షుడు శ్రీరామచంద్ర మూర్తి అభినందనీయుడని రాఘవరెడ్డి అన్నారు. ఎర్రయ తర్వాత అద్దంకి కవుల సాహిత్య సృష్టి అక్షరబద్ధం కాలేదని, గత 27ఏళ్ళ సృజన సాహిత్య కృషిని అందించే అదృష్టం దక్కిందని సృజన సాహితీ వైభవం గ్రంథకర్త శ్రీరామచంద్రమూర్తి అన్నారు.
సృజన 27వ వార్షికోత్సవ సభ, పద్యశాసన ప్రతికృతి ఆవిష్కరణ 18వ వార్షికోత్సవ సభ స్థానిక శ్రీనివాస ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపసభాపతి, ప్రపంచ తెలుగు మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ ముందుగా పద్యశాసనానికి, ఎర్రయ్య విగ్రహానికి, సరస్వతీ దేవి విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. సృజన వారు పద్యశాసన ప్రతికృతి ఆవిష్కరించి, పద్యాన్ని రక్షించి, పద్యానికి గొడుగు పట్టారని అన్నారు. ఈకార్యక్రమంలో పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి, డాక్టర్ జివి పూర్ణచందు, డాక్టర్ యు దేవపాలన, గాడేపల్లి దివాకర దత్తు, మన్నం త్రిమూర్తులు, వీరవల్లి రుద్రయ్య, కె అనిలకుమార సూరి, సంకా బాబు, జ్యోతి చంద్రమౌళి పాల్గొన్నారు. తర్వాత సింగరకొండ ఆంజనేయ స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆయన వెంట శ్రీరామచంద్ర మూర్తి, పూర్ణచందు, సందిరెడ్డి శ్రీనివాసరావు ఉన్నారు.










