Dec 03,2022 00:12

కె.కోటపాడు చౌడువాడలో పొలంలోనే వరి చేను కుప్పలు పెడుతున్న రైతులు

ప్రజాశక్తి- కె.కోటపాడు, బుచ్చయ్యపేట
బంగాళాఖాతంలో ఈ నెల 5న అల్పపీడనం ఏర్పడి, అది వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో కోస్తా తీరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి పంట పూర్తిగా పండడంతో కోతలు కోసి పొలంలో ఆరబెట్టగా, కొన్ని ప్రాంతాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇటువంటి సమయంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడితే ఎంతో శ్రమటోర్చి పండించిన వరి పంట నీటిపాలవుతుందన్న భయాందోళనలతో రైతులు ఉన్నారు. ఈ సంవత్సరం కె.కోటపాడు మండలంలో 2245 హెక్టార్లలో వరి వేశారు. విత్తనాలు వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేవరకు రైతుకు దినదిన గండంగానే ఉంటుంది. అధిక శాతం రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసిన సాంబామసూరి, ఆర్‌జెఎల్‌, స్వర్ణ, ఇంద్ర తదితర వరి విత్తనాలు వేశారు. వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో మెట్ట ప్రాంతాల్లో కూడా వరి పంట వేయడం జరిగింది. ఈ సంవత్సరం కొన్ని రకాల వరి పంటలకు ఎక్కువగా తెగుళ్లు సోకటంతో వేలాది రూపాయలు వెచ్చించి పురుగు మందులు కొనుగోలు చేసి పిచికారీ చేశారు. అయినా కొద్ది మేరకు దిగుబడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కె.కోటపాడు మండలంలో 30శాతం వరకు పంటలు పూర్తిగా పండి పోవడంతో కోత కోసి పంట పొలాల్లో ఆరబెట్టారు. బుచ్చయ్యపేట మండలంలోని రాజాం, నీలకంఠాపురం, ఆర్‌.శివరాంపురం, తైపురం, పెద్దమదిన, బుచ్చయ్యపేట, కందిపూడి తదితర గ్రామాల్లో వారం రోజులుగా రైతులు వరి పంటను కోశారు. వరి పంట కోసిన వెంటనే కుప్పలుగా పెడితే వరి పనలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అయితే రెండు రోజుల నుండి వాతావరణంలో మార్పులు కనిపిస్తుండటంతో పంట పొలాల్లో ఉన్న చేలను కుప్పలుగా పెట్టడానికి రైతులు పరుగులు తీస్తున్నారు. అల్పపీడనం వాయుగుండంగా మారి వర్షాలు కురిస్తే వరి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వాతావరణంపై ముందుగా రైతులకు పలు సూచనలు, సలహాలు అందించాలని పలువురు కోరుతున్నారు.