Nov 20,2023 23:22

కోతకు వచ్చిన వరిచేను

ఖరీఫ్‌ మాసూళ్లపై ప్రభావం
అన్నదాతల గుండెల్లో గుబులు
వర్షం పడితే నష్టం తీవ్రతరం
ప్రజాశక్తి - రాజోలు
అల్పపీడనంతో అన్నదాతల్లో అలజడి నెలకొంది. కమ్ముకుంటున్న మబ్బులు వారిని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆది నుంచి అన్నదాతకు అష్టకష్టాలు తప్పడం లేదు. సీజన్‌ ప్రారంభంలో భారీ వర్షాలు, వరదలకు నారుమళ్లు రెండుసార్లు ముంపు బారిన పడగా, తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. నాలుగు నెలలుగా వర్షాలులేక వరిచేలు అంతంత మాత్రంగా ఉంటే.. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రామచంద్రపురం డివిజన్‌లోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. అమలాపురం డివిజన్‌లో అక్కడక్కడ స్వల్పంగా వరి కోతలు పూర్తి చేసి మాసూళ్లు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల ఎకరాల్లో మాత్రమే మాసూళ్లు పూర్తికాగా.. కొన్ని చోట్ల పంట పనలపై ఉంది. పంటచేతికొచ్చే దశలో వాతావరణం మేఘావతం కావడంతో రైతులు హడావుడిగా కట్టేతకట్టి గట్టు మీదకు తెస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు కోతలు నిలుపుదల చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువగా రైతులు ముంపును తట్టుకునే స్వర్ణ రకం (ఎంటీయూ 7029)ను సాగు చేయడం ఆనవాయితీ. సుమారు 50 శాతానికి పైగా స్వర్ణ రకం వరి వంగడాన్నే వేశారు. కోతకు వచ్చిన వరిచేలు ప్రస్తుతం వీస్తున్న గాలులకు పూర్తిగా నేలమట్టమవుతున్నాయి. బలమైన గాలుల కారణంగా నేలవాలిన వరిచేలు కోతలు కోయడానికి, కట్టేతకు ఎకరాకు మరో ఐదుగురు కూలీలు అదనంగా కావాల్సి రావడంతో.. మాసూళ్లకు తమపై మరింత భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వారు ఆందోళన చెందుతున్నారు.
ఏటా ఇదే పరిస్థితి ..!
గత ఖరీఫ్‌ సీజన్‌లోనూ రైతన్నలకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అల్పపీడనం ప్రభావంతో వరి చేలు నేలకొరిగి ముంపు బారిన పడడంతో ధాన్యం మొలకలు వచ్చి అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా వర్షానికి తడిచిన ధాన్యం కొనడానికి సవాలక్ష కొర్రీలు పెట్టడంతో రైతన్నలు దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం చేతికొచ్చిన పంట అల్పపీడన ప్రభావంతో ఏమవుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వర్షం పడితే తీవ్ర నష్టం
ఈ ఏడాది వర్షాలు లేక నానా ఇబ్బందులు పడ్డాం. వర్షాభావ పరిస్థితుల్లో ఒకటికి రెండు సార్లు ఎరువులు, పురుగు మందులు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ప్రస్తుతం పంట చేతికొచ్చిన సమయంలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారింది. వర్షం కురిస్తే పంట ఒబ్బిడి చేసుకోవడానికి నానాపాట్లు పడాలి. వర్షం తీవ్రంగా పూర్తిగా నష్టపోతాం.
- బుంగ సత్యనారాయణ, కౌలు రైతు, రాజోలు