Jul 23,2021 17:24

అమరావతి : వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఎపిలో రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ.. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 26 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.