'మన సంస్కృతి నశించిపోతూందన్న/ మన పెద్దల విచారానికి/ మనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం/ మనగలిగినదీ/ కాలానికి నిలబడగలిగినదీ వద్దన్నాపోదు/ మరణించిన అవ్వ నగలు/ మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు/ యుగయుగానికీ స్వభావం మారుతుంది/ అగుపించని ప్రభావాలకి లొంగుతుంది/ అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్టు ఊహించకు' అంటాడు తిలక్. ఇది ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికీ ఆయన సంఘపరివారానికీ ఎప్పటికైనా బోధపడుతుందా? స్త్రీల వస్త్రధారణ అంశం మళ్లీ చర్చకు రేపాడాయన. స్త్రీలైనా, పురుషులైనా అప్పటి ఫ్యాషన్‌ను బట్టి, ట్రెండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటారు. దుస్తుల ధారణ విషయంలో పాశ్చత్య సంస్కృతి అనో, స్వదేశీ సంస్కృతి అనో వుండదు. అన్ని దేశాల సంస్కృతి అంతా కలగలిసిపోయిన ఆధునిక ప్రపంచంలో... సంగీతం, సాహిత్యం, శిల్పం, చివరకు సైన్స్ కూడా సంస్కృతిలో ఒక భాగంగా మారిపోతుంది. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే క్రమంలో మానవజాతి అభివృద్ధి చెందుతుంది. ఇది వదిలేసి... మా సంస్కృతి, మా సంప్రదాయం అంటూ గిరిగీసుకొని బతికితే... ఆదిమానవుల కాలంలోనే వుండిపోవాల్సి వస్తుంది. అండమాన్‌లో ఓంగే అనే తెగ వుంది. ఆ తెగ మొత్తం 110మంది మాత్రమే. వారెందుకు అంతరించిపోతున్నారంటే... ఇతర తెగలతో, ఇతర ప్రాంతాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకపోవడం వల్ల. అలాగే, ఎవరితోనూ సంబంధం లేకుండా వుండాలనుకోవడం వెనుకబాటుతనానికి చిహ్నం తప్ప అభివృద్ధికి సంకేతం కాదు. జాతుల మధ్య సంకరం అనేది అభివృద్ధి సూచకం. సంకరం జరుగుతుందని బాధపడేవాడు జాతి అంతరించిపోవడానికి దోహదం చేస్తాడు తప్ప పురోగతికి కాదు.
తాజాగా... 'మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించిన ఆడవాళ్లు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు. పాశ్చాత్య పిచ్చిలో మన సంస్కృతిని మరిచిపోతున్నాం' అని బిజెపి నాయకుడు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్ రావత్ వ్యాఖ్యానించడం కూడా తిరోగమన చర్యగానే భావించాలి. అంతరించిపోతున్న జాతికి ప్రతినిధిలా ఆయన మాట్లాడుతున్నారు. హిందూత్వ వాదులు పురుషుల దుస్తుల గురించి ఎందుకు మాట్లాడటంలేదు?
సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించే బాధ్యత స్త్రీలదే... పురుషులకేమీ సంబంధం లేదన్నట్లుగా కాషాయవాదులు మాట్లాడటం విడ్డూరంగా వుంది. మన దేశంలో 90 శాతానికి పైగా పురుషులు... మన సంప్రదాయ దుస్తులను ఏనాడో వదిలేశారు. సాంప్రదాయ వస్త్రధారణను ఎక్కువగా కొనసాగిస్తున్నది స్త్రీలే. వారికి నచ్చిన విధంగా వస్త్రధారణ చేసుకునే హక్కు వారికుంది. దానిని ఎందుకు గౌరవించరు? దుస్తుల గురించి మాట్లాడుతున్న ప్రతిసారీ... స్త్రీల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను ఎందుకు గుర్తించడంలేదు? భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? 'ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ, / ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా వున్నదనీ, / అయిదు ఖండాల మానవ సంస్కృతి/ అఖండ వసుదైక రూపాన్ని ధరిస్తోందని' అంటాడు తిలక్. అలాగే... ఎవరితోనూ సంపర్కం పెట్టుకోకుండా మనకు మనమే పాత సాంప్రదాయాల మడికట్టుకోవడం... దాన్ని కాపాడుకోవాలనుకోవడం... వెనుకబాటు తనానికి నిదర్శనం. ఒంటిగా వున్న జాతులు, తెగలు అంతరించిపోతుండటం చారిత్రక వాస్తవం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలంటే ఈ సాంస్కృతిక సమ్మేళనం గురించి ప్రయత్నించాలి. అప్పుడే మన పూర్వులు ఆశించిన విశ్వమానవ కుటుంబం అనే భావన సాకారమౌతుంది.










