Apr 18,2021 15:10

నాటి తరం అమర త్యాగాలు
వేనవేల వీరుల వీర తిలకమై
ఒక్కొక్క బలిదానం
లక్షల మెదళ్ళ కదలికై
శిరమెత్తి .. శివమెత్తి సాధించిన
స్వాతంత్య్రం .. నా దే(హ)శ స్వాతంత్య్రం
ఉదారవాద తోడేళ్ళ గుంటనక్కల
పాలక గణాల బావిలో పడి
రక్తం కక్కుతూ తునాతునకలౌతోంది

చమురు ధర నియంత్రణ స్క్రూలు విప్పేశాక
భూతాలూ ప్రేతాలూ ధరల చెరావతారాలెత్తి
ఇళ్ళల్లో బతుకుల్ని కుళ్ళబొడుస్తున్నాయి
నగదు బదిలీ 'గ్యాస్‌'లో తుస్సుమనిపిస్తే
బతుకు 'బండ'పై పడి బద్దలౌతోంది

రైతులకు చౌక వడ్డీ అప్పులతో
చిన్న వ్యాపారులకు సులభ రుణాలతో
బతుకు పతాక నెగరేసిన ప్రభుత్వ బ్యాంకులు
వధ్య శిలపై నిలపబడ్డాయి
చిన్న పెద్ద ఉద్యోగులకు
భరోసా తిలకం దిద్దిన 'బీమా'
ధీమా తప్పించడంతో
ఊబిలో ఈగై విలవిలలాడుతోంది

ప్రయివేటు రాబందులు
పాలక ఆత్మబంధులయ్యాక
ప్రభుత్వ రంగమే
చురకత్తుల బోనులో పడింది

ప్రభుత్వరంగ ధ్వంసం అంటే
చెమట చుక్కల కడుపు పంటై పుట్టిన
ప్రభుత్వరంగమనే బిడ్డల హత్యగా
అనిపించ లేదా? కనిపించ లేదా?

సాధించిన ప్రజాస్వామ్యాన్ని
ముక్కలు ముక్కలుగా నరికేస్తూ
కాంక్రీటుతో సమాధి చేస్తుంటే
నీ నోటికి తాళం వేస్తున్నారనీ
కాళ్ళూ చేతులకూ బేడీలుస్తున్నారనీ
నిన్ను 'దేశీ' బానిసను చేస్తున్నారనీ
నీ మెదడు నాళాలు మరగడం లేదా?

నీ ప్రభుత్వరంగమనే బిడ్డల చంపుతున్నా
నీ హక్కులు సమాధి చేస్తున్నా
నీ .. నా .. గోడల
తలుపులు తెరవకుంటే ...
జన వనంలో 'మనం'గా మారకుంటే
రేపు నువ్వూ ఉండవు .. నేనూ ఉండను
మన వారసులూనూ .. అందరం
మ్యూజియంలోనే కనిపిస్తాం

కార్పొరేట్ల కార్లకే చక్రాలుంటాయి
ఇది హెచ్చరికో మేల్కొలుపో తేల్చుకో

- ఉన్నం వెంకటేశ్వర్లు
8332807330