
- తన జీవిత కాలాన్ని నిర్ణయించుకున్న డాక్టర్ పాలేటి
- అక్టోబర్ 14న మరణ దినోత్సవ వేడుకలు ఆహ్వానం
ప్రజాశక్తి - చీరాల
సుధీర్గ రాజకీయ వేత్త. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు తీసుకునే నిర్ణయాలు విభిన్నంగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే ఆయన ఈ ఏడాది కూడా తన ఆత్మీయులందరికీ ఆహ్వానం అందించారు. సాధారణ ఆహ్వానమైతే పెద్దగా చర్చ ఏమీ ఉండదు. కానీ ఆయన ఇచ్చిన ఆమ్వానం తన చివరి ఘడియలను తానే నిర్ణయించుకుని మరణ దినోత్సవ వేడుకలపేరుతో ఆహ్వానం ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఇలాగే తాను మరణ దినోత్సవం జరుపుకున్నారు. 1959లో జన్మించిన తాను 75సంవత్సరాలు జీవించగలడని భావించాడు. ఆ ప్రకారం 2034వ సంవత్సరం తన జీవితంలో చివరి ఏడాదిగా నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం గత ఏడాది అంటే 2022నాటికి ఇంకా 12సంవత్సరాలు ఉందని లెక్కించి 12వ మరణ దిన వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం 11వ మరణ దిన వేడుకలకు ఆహ్వానం అందించారు. ఈనెల 14న టిటిడి కళ్యాణ మండపంలో వేడుకలు జరుగనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది 10వ మరణ దిన వేడుకలకు ఆహ్వానిస్తానని కూడా అందులో ఉదహరించారు. ఇలాంటి ఆహ్వానం అరుదుగా ఉంటుంది. దీనికి తాను ఆధ్యాత్మిక చింతనతో ప్రేరణ పొందినట్లు చెబుతున్నారు. ఏ జీవైనా పుట్టిన తర్వాత మరణం తప్పదని, అలాంటిది మనిషి విపరీత కోరికలతో అనేక పొరపాట్లకు పాల్పడుతున్నారని అన్నారు. తాను ఎంత కాలం జీవించగలడో ఎవరైనా అంచనా వేసుకోగలిగితే జీవించి ఉన్న కాలంలో నలుగురికీ ఉపయోగపడే పనులు ఏమి చేయవచ్చో మననం చేసుకుంటారని జీసస్, కృష్ణ, గౌతమ బుద్దుడు, అల్లా చెప్పిన శాంతి సందేశాలను ఉదహరిస్తున్నారు. జీవించి ఉన్న కాలంలోనే బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు ఉంటాయనేది అందరూ గుర్తుంచుకునే విధంగా ఆచరణలో చూపాలనే తాను ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.