Jun 03,2023 23:17

రైతే రాజు నాటికలో ఒక సన్నివేశం

ప్రజాశక్తి- అనకాపల్లి
అనకాపల్లి జార్జి క్లబ్‌ వైకే నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌, ఆది లీల ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జార్జి క్లబ్‌ ఆవరణలో కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు రెండో రోజు కొనసాగాయి. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌ కళాంజలి వారు 'రైతే రాజు', గుంటూరు అభినయ ఆర్ట్స్‌ వారు 'అతీతం' నాటికలు ప్రదర్శించారు. కంచర్ల సూర్యప్రకాశరావు రచించి, కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన 'రైతే రాజు' నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశాన్ని రక్షించేది జవాన్‌ అయితే దేశంలో ప్రజలకు కూడు పెట్టేది రైతు పండించిన పంట. ప్రపంచంలో గుండుసూది నుంచి విమానం వరకు తయారు చేసిన వస్తువులకు తయారీదారు ధరను నిర్ణయిస్తాడు. కాని ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మాత్రం ధరను నిర్ణయించే పరిస్థితి రైతుకు లేదు. మరో వైపు రైతు కల్తీ విత్తనాలు, ఎరువులు, మందులు, దళారులు వంటి శత్రువులు మధ్య బతకలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతు మరోలా ఆలోచించి పంటకు విశ్రాంతి ఇస్తే దేశ ప్రజలు ఏం తిని బతుకుతారో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తెలియచెప్పేదే 'రైతే రాజు' నాటిక. ప్రదర్శనలో ప్రతి కళాకారుడు వాస్తవ పరిస్థితులను సమాజానికి తెలియజేప్పాలా నటించారు.
కీర్తిశేషులు శిష్ట్లా చంద్రశేఖర్‌ నాటికీకరణలో, ఎన్‌.రవీంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించిన 'అతీతం' నాటిక ద్వారా ప్రపంచీకరణ నేపథ్యంలో నిశ్శబ్ద హింస ద్వారా మనకు తెలియకుండానే బానిసత్వ జాడలు, కుటుంబ అనుబంధాలు, మమతా అనురాగాలను దూరం చేసి డబ్బు వెనక మనిషి పరుగు, కుటుంబం, సమాజం ఏ విధంగా మహా విధ్వంసానికి గురవుతున్నాయో తెలియజెప్పారు. నాటిక ప్రదర్శనలో ప్రతి కళాకారుడు తన పాత్రలో లీనమై జీవం పోశారు. నాటిక ప్రదర్శనలను నిర్వహిస్తున్న జార్జి క్లబ్‌ పాలకవర్గాన్ని, వైకే నాటక పరిషత్తు ప్రతినిధులు బొప్పన నరసింహారావు ఉరఫ్‌ బుజ్జి, జి మల్లికార్జునరావు, నడింపల్లి వెంకటేశ్వరరావులను ప్రేక్షకులు అభినందించారు. సమాజానికి సందేశాన్నిచ్చే మరిన్ని కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.