Jun 02,2023 23:58

దర్శకుడిని సన్మానిస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి-మాడుగుల: మోదకొండమ్మ పండగ సందర్భంగా మాడుగులలో నిర్వహించిన నాటిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఈ నాటికలపై పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారంతో ఇవి ముగిశాయి. విశాఖ వారి జాస్మిన్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ప్రదర్శించిన వాయిదాల పెళ్లి నాటిక రక్తి కట్టించింది. కుమార్తె పెళ్లి ఒకే సారి భరించలేక, కట్నం, లాంఛనాలు వాయిదాలపై అల్లుడికి చెల్లించడానికి తండ్రి తపన పడడం, కుమార్తె మరో వ్యక్తిని ప్రేమించడం వంటి హాస్య సన్నివేశాలు రక్తి కట్టించాయి. జి.సీతారామారావు రచించిన నాటికకు సంధ్య ప్రియదర్శిని దర్శకత్వం వహించారు. తండ్రి పాత్రలో మొహిద్దీన్‌, తల్లి పాత్రలో సంధ్య ప్రియదర్శిని, కుమార్తెగా రమ, పెళ్లి కూతురుగా శివ జ్యోతి, పెండ్లి కుమారుడుగా సతీష్‌, జోగయ్య పాత్రలో బగాది విజయ సాయి నటించగా ఆర్గనైజర్‌గా రవీంద్ర నాథ్‌ వ్యవహరించారు.
అనంతరం పిటి మాధవ్‌ రచన, కవి ప్రసాద్‌ దర్శకత్వంలో విశాఖ అభినయ వారి శ్రీ కాసీవాసి రావయ్యా సందేశాత్మక నాటిక ఆకట్టుకుంది. వృద్దాప్యంలో తల్లిదండ్రులు పడే ఇబ్బందులు, కొడుకులు ప్రేమ చూపినా కోడలు పెట్టే వేధింపులు తో శత్మశానంలో చితి పేర్చుకుని తండ్రి ఆత్మహత్యకు పాల్పడడం కథాంశంగా నాటిక ప్రదర్శించారు. ఇందులో సారయ్య పాత్రలో కవి ప్రసాద్‌, నూకాలుగా సంధ్య ప్రియ దర్శిని, ఆనందరావుగా నాంచారయ్య, రవిగా పి మోహన్‌, వేదించే కోడలు పాత్రలో రమ, హెడ్‌ కానిస్టేబుల్‌ గా మొహిద్దీన్‌, శివుడు పాత్రలో హరనాథ్‌ నటించారు. రంగాలంకరణ, ఆహార్యం సాయి, లైటింగ్‌ థామస్‌ అందించారు. అనంతరం దర్శకుడు కవి ప్రసాద్‌కు ఆలయ కమిటీ తరపున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు ఇతర సభ్యులు పాల్గొన్నారు.