Mar 07,2023 23:50

ఇది కథ కాదు నాటికలోని సన్నివేశం

ప్రజాశక్తి అచ్చుతాపురం
మండలంలోని హరిపాలెం గ్రామంలో కాండ్రేగుల వారి ఆధ్వర్యంలో రెండోరోజు సోమవారం రాత్రి నిర్వహించిన నాటికల ఆలోచింపజేస్తున్నాయి. గ్రామ దేవత పారిపల్లి అమ్మవారి పండగ సందర్భంగా కాండ్రేగుల భోగలింగం నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు రెండో రోజు సోమవారం రాత్రి కూడా కొనసాగాయి. పోటీలలో భాగంగా చీకటి పువ్వు, నాన్న నేను వచ్చేస్తా, ఇది కథ కాదు అనే నాటికలను ప్రదర్శించారు. ఈ నాటికలు సమాజానికి సందేశాతకమైన మార్పునకు, ఆదర్శమైన వంతమైన మార్గం చూపించాయి. ఆత్మహత్యలు సరికావు అనే సందేశం ఇచ్చాయి. మానవతా విలువలతో కూడిన జీవనం సాగించాలని మార్గం చూపించాయి.
విశాఖకు చెందిన భద్రం ఫౌండేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ కళాకారులు ''ఇది కథ కాదు'' అనే నాటికి ప్రదర్శించారు. ఆరిపాక ప్రభాకర్‌ మూల కథ అందించిన ఈ నాటికకు నాటకీకరణ, దర్శకత్వ బాధ్యతలు ఎస్‌.డేవిడ్‌ రాజు వహించారు. పేదల అత్యాశను ఆసరాగా చేసుకుని ధనార్జనే ధ్యేయంగా రోజుకొకటిగా పుట్టుకొస్తున్న బోగస్‌ చిట్‌ ఫండ్‌ సంస్థల మోసాలను కళ్ళకు కట్టినట్టు నాటికలో చూపించారు. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదని, ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, సమస్యలకు భయపడి బలవన్మరనాలకు పాల్పడకూడదని, ఆత్మహత్యలకు పాల్పడితే వారి మీదే ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ నాటికలో డేవిడ్‌ రాజ్‌, భాను ప్రకాష్‌, నూకరాజు, కుమారి, చందు, విజరు, మోహిద్దీన్‌ నటించగా తేజ సంగీత సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కాండ్రేగుల భాగలింగం, కాండ్రేగుల హరి, కాండ్రేగుల జోగి నాయుడు, కె.రామ సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం పారిపల్లి అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు చేశారు.