Apr 10,2021 06:57

   ''మానవ సమాజ చరిత్రలో సామాజిక మార్పు కోసం జరిగిన ఏ విప్లవమూ స్త్రీల కీలక పాత్ర లేకుండా జయప్రదం కాలేదు'' అని కారల్‌మార్క్స్‌ 1968లో తన మిత్రుడు కుగెల్‌ మాన్‌కు రాసిన లేఖలో ప్రస్తావించాడు.
  గుండెనిచ్చిన గున్నమ్మ, బావిరెడ్డి వియ్యమ్మ, వీరనారి అయిలమ్మ వంటి ఎందరో సామాన్య స్త్రీలు చరిత్రను మలుపు తిప్పిన పోరాటాలకు ఆద్యులయ్యారు. ఆనాటి జమిందార్ల, జాగీర్‌దార్ల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రగులుతున్న ప్రజా చైతన్యానికి పదునుపెట్టారు. మార్క్స్‌ భాష్యాన్ని రుజువు చేశారు.
  గత నాలుగు మాసాలకు పైగా రాజాధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళనను మన కాలంలో చూస్తున్నాం. మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగిస్తున్న ఉద్యమాన్ని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. మన కాలంలో... అందునా మీడియా, రవాణా సాధనాలు, వగైరా బాగా అభివృద్ధి చెందిన కాలంలో జరుగుతున్న పోరాటాలివి. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూద్దాం.
   బెంగాల్‌లో తెభాగ', త్రిపురలో గిరిజన పోరాటాలు, కేరళలో పున్నప్ర వాయలార్‌, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, అన్నిటికీ ఉత్ప్రేరకంగా ఉన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటివి మన తరానికి ప్రత్యక్షంగా తెలీదు. అయితే రైతాంగ ఉద్యమాల చరిత్రనెరిగిన వాళ్ళకి బాగా తెలిసిన సత్యాలు. తెలుగు రాష్ట్రాల్లో మందస, చల్లపల్లి వంటి జమీందారీ వ్యతిరేక పోరాటాలు పదుల సంఖ్యలో జరిగాయి. ఈ పోరాటాల్లో రైతులతో పాటు రైతు స్త్రీల పాత్ర చాలా గొప్పది.
   ఏప్రిల్‌ 10వ తేదీన బావిరెడ్డి వియ్యమ్మ, మరో ముగ్గురు రైతు సోదరులు తుపాకి గుళ్లకు బలైన రోజు. సరిగ్గా 2021 ఏప్రిల్‌ 10 నాటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి.
  వియ్యమ్మది గుంటూరు జిల్లా గాజుల్లంక గ్రామం. కృష్ణా నది ఒడ్డున ఉన్న గ్రామం. కృష్ణా జిల్లాలోని దివి తాలూకాకు సరిహద్దు గ్రామం కూడా. గాజుల్లంక, పోతార్లంక, పెసర్లంక వగైరా లంక గ్రామాలు చల్లపల్లి జమీందార్ల ఆధీనంలో ఉండేవి. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు రైతుల భూములు వరదల్లో కొట్టుకు పోయేవి. మరెక్కడో తేలేవి. అలా తేలిన లంక భూముల్ని జమీందారు స్వాధీనం చేసుకునేవాడు. భూములపై హక్కుల కోసం రైతులు పోరాడేవారు. జమీందారు ఆధీనంలో వున్న 60 గ్రామాల ప్రజలు భారీ శిస్తులకు వ్యతిరేకంగా దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగమే వియ్యమ్మ తదితర రైతుల పోరాటం. అందులో భాగమే వియ్యమ్మ తదితరులపై జమీందారు పక్షాన పోలీసులు కాల్పులు జరపడం. ఆ కాల్పుల్లో బావిరెడ్డి వియ్యమ్మతో పాటు మత్తి సుబ్బారావు, సనకా సుబ్బారావు, తాడిశెట్టి వెంకటేశ్వర్లు అనే రైతుల ప్రాణాలు పోయాయి.
   మరో పోరాటం మందస జమీందారీ వ్యతిరేక పోరాటం. ఈ పోరాటంలోనే 1940 ఏప్రిల్‌ 1వ తేదీన వీర గున్నమ్మ మరణించింది. శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో అధిక పన్నులకు వ్యతిరేకంగాను, అటవీ ఉత్పత్తులపై హక్కుల కోసం పెద్ద పోరాటమే జరిగింది. ఇటు బ్రిటిష్‌ పోలీసులతోను, అటు అధికార్లతోను పెద్ద పోరాటమే జరిగింది. ఈ పోరాటంలో కొంతమంది రైతులను అరెస్టు చేసి తీసుకుపోతుంటే గున్నమ్మ అడ్డుపడింది. పోలీసు బెదిరింపులకు, తూటాలకు ఆమె బెదరలేదు. పోలీసుల తూటాలు గున్నమ్మ పొట్టను చీల్చుకుంటూ పోయాయి.
   భర్త చిన్న వయసులోనే చనిపోయినా, అప్పటికి నిండు చూలాలుగా వున్న సాసునూరు గున్నమ్మ రైతుల పక్షాన నిలబడి బ్రిటిషు పోలీసు తూటాలకు ప్రాణాలు బలిపెట్టింది. రైతాంగ పోరాటాలకు ప్రేరణగా నిలిచింది.
చాకలి అయిలమ్మ తెలంగాణా వీర వనిత. ఆమెది జనగామ దగ్గరున్న పాలకుర్తి గ్రామం. సామాన్య రైతు మహిళ. కులవృత్తి చేసుకుంటూ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబం గడిపేది. తన భూమిని స్వాధీనం చేసుకునే దురుద్దేశ్యంలో పంటను కోసుకుపోవడానికి విసునూరు దేశ్‌ముఖ్‌ గూండాలు ప్రయత్నించారు. అప్పటికే ఆంధ్రమహాసభ సభ్యురాలిగా ఉన్న అయిలమ్మ తిరగబడింది. అయిలమ్మ భర్త, కుమారులను అరెస్టు చేశారు. అయినా లొంగలేదు. భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి నాటిి నాయకుల సహకారంతో పోరుబాట బట్టి తన భూమిని దక్కించుకుంది. అయిలమ్మ సాహసం అప్పటికే రగులుతున్న తెలంగాణ ప్రజల్లో చైతన్యాగ్నిని పుట్టించింది. ప్రజలు పోరుబాట పట్టారు.
   1946 జూలై 4వ తేదీన దొడ్డి కొమరయ్య వీర మరణంతో నాటి తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున లేచారు. దొరల పెత్తనాన్ని, వారికి మద్దతిచ్చిన నైజామ్‌ సర్కారుని గద్దె దించారు.
   ఆడవాళ్లు అబలలు, అసమర్ధులు కారు. అవసరమైతే తిరగబడతారని నిరూపించారు. ఆ పోరాటాలే రాష్ట్రంలో జమీందారీ, జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసి రైతాంగానికి భూములపై హక్కులు వచ్చేలా చేశాయి. ఆ పోరాటాలే రైతాంగం కాస్త ఊపిరి పీల్చుకునేలా చేశాయి.
 

/ వ్యాసకర్త 'ఐద్వా' జాతీయ కోశాధికారి /
ఎస్‌. పుణ్యవతి