Sep 18,2023 00:24

- శిధిలావస్ధకు చేరిన భవనాలు
- పట్టించుకోని పాలకులు, అధికారులు
- నిర్మాణం పూర్తయినా నిరుపయోగం


ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
శిధిలావస్ధకు చేరిన ప్రభుత్వ భవనాలను పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. భయం గుప్పిట్లో సిబ్బంది కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని కార్యాలయాలు శిధిలావస్ధకు చేరి కూలేందుకు సిద్దంగా ఉన్నాయి. బిసి బాలుర వసతి గృహం మాత్రం ప్రారంభం కాకుండానే నెర్రెలు ఇచ్చి వెక్కిరిస్తూ ఉంది. సాక్షాత్తు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయం లేక వెలుగు ఆఫీసు పంచలో తలదాచుకుంటున్నారు. పురాతన ఎంపిడిఓ కార్యాలయంలో ఎన్‌ఆర్‌జిఎస్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. విషసర్పాలు, పాములు తిరుగుతుండటంతో భయం గుప్పిట్లో విధులు నిర్వహించుకుంటున్నారు. బిసి బాలుర వసతి గృహం నిర్మించినప్పటికి ప్రారంభాకి నోచుకోలేదు. పగుళ్ళిచ్చి వెక్కిరిస్తూ ఉంది. కాంట్రాక్టర్‌ చేసిన నిర్వాకానికి భవనం అలాగే ఉండి పోయింది. బాట సారులు ఈ భవనంలో తల దాచుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారింది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కార్యాలయం కూలేందుకు సిద్దంగా ఉంది. అధికారులు అందుబాటులో ఉండరు. ఉద్యోగులు కూడా తలో దిక్కులో వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీతాలు మాత్రం నెల నెలా తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం భవనాలకు నిధులు మంజూరు చేయక కాంట్రాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు లబోదిబో అంటున్నారు. మండలానికి ఇంజనీర్లు కరువయ్యారు. డిప్యుటేషన్‌పై వచ్చి కొన్ని రోజులు తూతూమంత్రంగా పనులు చేయటం, మరలా సొంత గూటికి చేరటం అధికారుల తంతుగా మారింది. పంచాయితిరాజ్‌ ఇంజనీరు లేక ఈ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు అల్లాడి పోతున్నారు. మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో గత నాలుగు సంవత్సరాల నుండి ఏకరవు పెడుతున్నా వారి సమస్యలు వినే నాధుడు లేడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ కాలం వెళ్ళతీస్తున్నారు. సొంత పార్టీలో ఉండి ఏమి చేయలేక అల్లాడిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో బిల్లుల పరిస్ధితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే వీరి సంగతి ఏమిటని మనో వేదనకు గురవుతున్నారు.