ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలో ఆయా గ్రామాలలో నిర్మించిన సంపద కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ఈ కేంద్రాలకు రంగులు వేశారు గాని సంపద ఎక్కడ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి డంపింగ్ యార్డ్‌లు నిర్మించారు కానీ అవి నిరుపయోగంగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ డంపింగ్ యార్డులు మందు బాబులకు నిలయాలుగా మారాయి. గ్రామాలలో చెత్తను సేకరించి, డంపింగ్ యార్డ్ ద్వారా రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన వర్మి కంపోస్టు ఎరువును తయారు చేసి విక్రయించాల్సి ఉంది. ఆ ఎరువును రైతులు వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాల్సి ఉంది. కానీ మండలంలో ఏ గ్రామంలో కూడా ఈ తరహా వ్యవహారం కనిపించడం లేదు. గ్రామాల్లో చెత్తను సేకరించే రిక్షా కార్మికులకు నెలల తరబడి అధికారులు జీతాలు చెల్లించకపోవడంతో, వారు చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించడం మానుకున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు డంపింగ్ యార్డ్ ద్వారా నాణ్యమైన వర్మి కంపోస్టు ఎరువును తయారు చేసి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.










