Feb 23,2023 00:26

ముసుగు వేసిన అల్లూరి విగ్రహం

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ :నర్సీపట్నం నడిబొడ్డున రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయానికి ఎదురుగా ప్రధాన రహదారి వద్ద ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అధికారులు బుధవారం ముసుగు వేయడం అశ్చర్యాన్ని కలిగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నిబంధనల మేరకు ముసుగు తొడిగారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలి. ఇలా స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు ముసుగులు వేయడం ఏమిటని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నేతల ఫ్లెక్సీల తొలగింపులో శ్రద్ధ చూపని అధికారులు అల్లూరి విగ్రహానికి ముసుగు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గొలుగొండ: అల్లూరి విగ్రహ ముఖ భాగానికి ముసుగు వేయడం సరికాదని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమలు బాధ్యతను అధికారులు పట్టించుకోకుండా కిందిస్థాయి ఉద్యోగులకు అప్పగించడంతో ఇటువంటి దుశ్చర్య నెలకొందన్నారు. అధికారులు తొలుత గుర్తించలేదని, టీవిల్లో వచ్చేంతవరకు స్పందించలేదన్నారు.