May 08,2023 21:37

ప్రజాశక్తి - ఏలూరు
               అల్లూరి సీతారామరాజు వర్థంతి కార్యక్రమాన్ని స్థానిక ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రంలో వైఎంహెచ్‌ఎ హాలులో సోమవారం నిర్వహించారు. హేలాపురి సింగర్స్‌ అసోసియేషన్‌ గాయకులు అభ్యుదయ సినీ గేయాలతో అలరించారు. 25 మంది అల్లూరి సీతారామరాజు వేషధారణతో కూడిన విద్యార్థుల బృందం ''రగిలింది విప్లవాగ్ని ఈరోజు'' అనే పాటకు అనుగుణంగా ప్రదర్శన ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి రచయిత కూనపరాజు కుమార్‌, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహరావు ఆలపాటి నాగేశ్వరరావు పూలమాల వేసి నిశాళులర్పించారు. అక్షరం ఆర్ట్స్‌ డి.రాములు, మజ్జి కాంతారావు, మేతర అజరుబాబు, పి.కస్తూరిబారు, జి.శారద, పి.హైమావతి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, సాయిబాబు పాల్గొన్నారు. సభకు హేలాపురి సింగర్స్‌ అసోసియేషన్‌ గాయకులు అర్జున్‌రావు స్వాగతం పలకగా ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహరావు అధ్యక్షత వహించారు. సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న కూనప రాజుకుమార్‌, అక్షరం ఆర్ట్స్‌ డి.రాములు, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, గుడిపాటి నరసింహరావు మాట్లాడారు. అనంతరం సభలో ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు బుక్లెట్‌ను ఆవిష్కరించారు. ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. కళాకారులందర్నీ పుస్తకాలు ప్రశంసాపత్రాలు మెమెంటోలతో అభినందించారు.
పవర్‌పేట సిపిఎం జిల్లా కార్యాలయంలో అల్లూరి వర్థంతి సభ సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రవి మాట్లాడుతూ సీతారామరాజు దేశంలో గిరిజనుల కోసం ఆనాడే పోరాడి వారికి భూములు సాధించి పెడితే, నేటి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అటవీ భూములను తిరిగి మళ్లీ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతుందని విమర్శించారు. దీంతో రాజ్యాంగం కల్పించిన అటవీభూములపై గిరిజనుల హక్కులు కాలరాయపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో గిరిజన చట్టాల అమలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహరావు, ఎ.శ్యామలారాణి, నాయకులు పి.ఆదిశేషు, సిపిఎం ఏలూరు నగర కమిటీ సభ్యులు బి.జగన్నాధరావు, కె.రామాంజనేయులు, కట్టా సత్యనారాయణ, వి.శైలజ, నాయకులు జె.గోపి, పి.జానుబాబు, బి.త్రినాధ్‌, మీసాల సత్యనారాయణ, సింహచలం పాల్గొన్నారు.
ఏలూరు అర్బన్‌ : అల్లూరి వర్థంతి సందర్భంగా పిడిఎస్‌యు, ఇఫ్టు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జూట్‌మిల్‌ సెంటర్‌ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ సహజ వనరుల్ని అంబాని, ఆదాని వంటి కార్పొరేట్లకి అప్పగిస్తున్న మోడీ ప్రభుత్వంపై అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని కోరారు. నూతన అటవీ హక్కుల చట్టంతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను అడవి నుంచి తరిమి వేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ దేశంలో అసమానతలు, నిరుద్యోగం పెద్దఎత్తున పెరుగుతుందన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతు, కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జిల్లా కార్యదర్శి బద్ధ వెంకట్రావు, ఇఫ్టు నగర అధ్యక్షులు యెర్రా శ్రీను, పిడిఎస్‌యు నగర అధ్యక్షులు ఎం.క్రాంతి, సభ్యులు తేజ పాల్గొన్నారు.
చాట్రాయి : వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌, సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్థంతి సోమవారం చిన్నంపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ అల్లూరి ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎం.హౌలీమేరీ, సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.