ప్రజాశక్తి -అడ్డతీగల
స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక పవనగిరి దేవస్థానంలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన అల్లూరి దాడి చేసిన పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడ ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పడాల మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దాడి చేసిన అడ్డతీగల పాత పోలీస్ స్టేషన్, దాని చుట్టూ అర ఎకరానికి పైగా ఉన్న ఖాళీ స్థలాన్ని, ఆయన పోరాటానికి ప్రధాన కేంద్రమైన 'పైడిపుట్ట' గ్రామం, మల్లవరం మామిళ్ళు ప్రాంతంలో ఉన్న అల్లూరి 'తపస్సు కొండ', అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడికి ముందు రోజు రాత్రి వ్యూహ రచనలు చేసిన 'తేనెల మంగి' తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం అల్లూరి 125వ జయంతి సందర్భంగా రూపొందించిన చిత్రపటాన్ని అడ్డతీగల పోలీస్ స్టేషన్ సిఐ వై.రాంబాబుకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి.అప్పలరాజు, సంఘం ప్రతినిధులు పవనగిరి స్వామీజీ, తణుకు వెంకట్రామయ్య, రామన శ్రీనివాసరావు, దంగేటి సత్తిబాబు, చోడిశెట్టి సుబ్బారావు, చెల్లూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులుగా చోడిశెట్టి
అడ్డతీగల : జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యవర్గ సభ్యులుగా చోడిశెట్టి సుబ్బారావు నియమించినట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు గురువారం ఒక ప్రకటన విడుదలలో తెలిపారు. ఈ నియామకం గురువారం నుండే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.










