ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి జిల్లాలో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముసురు వాతావరణంతో మన్యంలో చలి గాలులు తీవ్రమయ్యాయి. గత వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత ఆదివారం కూడా భారీ వర్షం కురిసింది. ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు సమీపాన మత్స్సగెడ్డ పొంగి ప్రవహించింది. దీంతో, పాడేరు, జి.మాడుగుల తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముసురుగా వర్షాలు కురవడంతో కొంత మంది గిరిజనులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నెల ఒకటి నుంచి ఆరు వరకు నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి జిల్లాలోని 22 మండలాల్లో ఆరు రోజులకు సాధారణ వర్షపాతం 54.8 మిల్లీమీటర్లు కాగా, 53 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలోని ఎటపాక, కూనవరం, విఆర్ పురం, అనంతగిరి, హుకుంపేట, పాడేరు, కొయ్యూరు మండలాల్లో వర్షాలు ఎక్కువగా కురిసాయి. ఈ మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది.
పాడేరు డివిజన్లో 11 మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలుు మంచంగిపుట్టు మండలంలో 2.8 మిల్లీమీటర్లు, పెదబయలులో 17.5 మిల్లీమీటర్లు, డుంబ్రిగూడలో 18.9 మిల్లీమీటర్లు, అరకులోయలో 29. 2 మిల్లీమీటర్లు, అనంతగిరిలో 75.5 మిల్లీమీటర్లు, హుకుంపేటలో 24.9 మిల్లీమీటర్లు, పాడేరులో 24.1 మిల్లీమీటర్లు,
జి మాడుగులలో 14.4 మిల్లీమీటర్లు, చింతపల్లిలో 21.1 మిల్లీమీటర్లు, జీకే వీధిలో 34.6 మిల్లీమీటర్లు, కొయ్యూరు మండలంలో 44 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది.










