Apr 04,2023 00:06

పాడేరు కలెక్టర్‌ కార్యాలయం

రెండు డివిజన్లతో ప్రత్యేక గిరిజన జిల్లా ఆవిర్భావం..
పరిపాలనా సౌలభ్యం పాడేరు డివిజన్‌కే పరిమితం
రంపచోడవరం ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు డిమాండ్‌
ప్రజాశక్తి పాడేరు:
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆవిర్భవించి ఏప్రిల్‌ నాలుగో తేదీకి ఏడాది పూర్తయింది. పాడేరు కేంద్రంగా పాడేరు, రంపచోడవరం డివిజన్లతో ప్రత్యేక గిరిజన జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాలో రెండు డివిజన్ల పరిధిలోని 22 గిరిజన మండలాలు అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే అల్లూరి జిల్లా ఆవిర్భావం వల్ల పరిపాలన సౌలభ్యం పాడేరు డివిజన్‌కు పరిమితంగా కాగా, పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరం డివిజన్‌లోని 11 మండలాలకు జిల్లా మార్పు జరిగిందే తప్ప, పాలన చేరువ కాలేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీంతో అల్లూరి జిల్లా ఆవిర్భావం తర్వాత కూడా గత ఏడాదిగా రంప చోడవరం డివిజన్‌ ప్రజలు, ప్రజాప్రతినిధులు తమకు ప్రత్యేక జిల్లా కావాలనే నినాదం లేవనెత్తారు.
రంపచోడవరం డివిజన్‌ పరిధిలోని ప్రజలు, అధికారులు, నేతలకు పాడేరు జిల్లా కేంద్రానికి సరైన రవాణా సౌకర్యం లేక నేటికీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు రాలేని పరిస్థితి కారణంగా జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వారం, పది రోజులకు ఒకసారి ఆయా మండలాల్లో పర్యటిస్తున్నారు.
అల్లూరి జిల్లాలో రోడ్లు, రవాణా వ్యవస్థ లేని కారణంగా అల్లూరి జిల్లా పేరులో ఆదర్శం ఉట్టి పడుతున్నప్పటికీ, అభివద్ధిలో ఒక్క అడుగు ముందుకు వేయని పరిస్థితి లేదు. విశాఖ ఉమ్మడి జిల్లాలో పాడేరు డివిజన్‌ గిరిజన ప్రాంతం, అటు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌ గిరిజన ప్రాంతం ఐటిడిఎ కేంద్రాలుగా అభివృద్ధిలో ప్రత్యేకత, ప్రాధాన్యతను కలిగి రాష్ట్రంలోనే ముందంజలో ఉండేవి. రెండు జిల్లాల్లోనూ పాడేరు, రంపచోడవరం డివిజన్లు తలమానికంగా ఉండేవి. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త. జిల్లా ఆవిర్భావం తరువాత ప్రభుత్వ విధాన రమైన పాలనా విస్తరణ వంటి చర్యలు మినహా, గత ఏడాదికాలంలో ఈ రెండు డివిజన్లలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిలో వెనుకబాటు కనిపిస్తోంది. నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో, చెప్పుకోదగ్గ సాగు, తాగునీరు, రహదారులు, వంతెనలు వంటి భారీ ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు మన్యంలో ఏర్పాటుకు నోచుకోలేదు.
గిరిజనుల ముంగిట జిల్లా కలెక్టర్‌...
అల్లూరి జిల్లా ఆవిర్భావంతో సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ గిరిజనులకు, గిరిజన ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి వచ్చారు. గతంలో జిల్లా కలెక్టర్‌ను కలుసుకోవాలంటే పాడేరు ఏజెన్సీ నుంచి విశాఖకు, ప్రజాప్రతినిధులు ప్రజలు సైతం వెళ్లేందుకు అవస్థలు పడే పరిస్థితి ఉండేది. జిల్లా ఆవిర్భావం తర్వాత ఇప్పుడు ఇటు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ కలుసుకునేందుకు చాలా సౌలభ్యం ఏర్పడింది.ఇదే సమయంలో రంపచోడవరం డివిజన్‌కు మాత్రం కలెక్టర్‌ చేరువలోకి రాదనే చెప్పాలి. మునుపు కాకినాడ వెళ్లేవాళ్లంతా, ఇపుడు పాడేరు వెళ్లేందుక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.
గిరిజనుల సంక్షేమానికి ఐటిడిఎలు ఆవిర్భవించిన తర్వాత గడచిన 50 ఏళ్లలో దాదాపు 50 మంది ఐఎఎస్‌ అధికారులకు ప్రాజెక్టు అధికారులుగా వచ్చి గిరిజన సంక్షేమానికి కృషి జరిపారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్‌తో పాటు సుమారు 15 శాఖల జిల్లా స్థాయి అధికారులు గిరిజనుల సేవలో చేరువయ్యారు.

జిల్లా పాలన చేరువైంది
పాడేరు జిల్లా ఆవిర్భావంతో పరిపాలన సౌలభ్యం కలిగింది. సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్‌కు వివరించి పరిష్కరించుకోగలుగుతున్నాం. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కూడా స్పందించి, సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు మూడు పంచాయతీలకు కలెక్టర్‌ వచ్చి రూ.4లక్షలతో పాఠశాల భవన మరమ్మతులు చేయించారు. రూ.8లక్షలతో రోడ్డు నిర్మాణం, గెడ్డ మరమ్మతులకు నిధులు మంజూరుకు హామీనిచ్చారు.
సీదరి రాంబాబు, సర్పంచ్‌ డి.గొందూరు పంచాయతీ

ఆశించిన పురోభివృద్ధి జరగలేదు..
అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన అన్న ప్రభుత్వ ప్రకటనకు, ఆచరణకు పొంతన లేదు. ప్రభుత్వ అధికారులు నేటికీ పూర్తిస్థాయిలో లేరు. నిధులు కేటాయింపు లేదు. ఉద్యోగులకు నివాస గృహాల ప్రతిపాదన నేటికీ చేయలేదు. కొత్త జిల్లాలో గిరిజన హక్కులు, చట్టాలు పకడ్బందీగా అమలు జరుగుతాయని ఆశించినా, ప్రభుత్వ నిరంకుశ విధానాల బాటలోనే అధికారుల బాధ్యతారాహిత్యం స్పష్టంగా ఉంది. పోలీసుల నిర్బంధం, నిఘా నీడలో గిరిజన జిల్లా ఉంది.
కొత్త జిల్లాలో అటవీసంరక్షణ చర్యలు మృగ్యం కాగా, అభివృద్ధి ముసుగులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులిచ్చేసింది. పర్యాటకంపై పెరిగిన పర్యావరణ కాలుష్యనియంత్రణ చర్యల్లేవు. జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ చేసినా, అమలులో ప్లాన్‌ లేదు. ఐటిడిఎకున్న అధికారాలు అమలు కావడం లేదు. గిరిజన చట్టాలు, హక్కుల ఉల్లంఘనలు, రద్దులు యథేచ్ఛగా సాగాయి.
పి. అప్పలనర్స,
జాతీయ కార్యవర్గ సభ్యులు, గిరిజన సంఘం,