Jul 04,2023 22:11

ప్రజాశక్తి - ఏలూరు
        ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర పోరాటం కోసం అలుపెరగని కృషి చేసిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్యం, త్యాగనిరతి, నిరాడంబరత తరతరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. అల్లూరి 126వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక జ్యుట్‌మిల్లు ఫ్లరు ఓవర్‌ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి పోరాట పటిమ, చరిత్రను సింహావలోకనం చేసుకోవడం మన కర్తవ్యమన్నారు. దేశ స్వాతంత్రోద్యమానికి తెలుగునేల అందించిన సాహస వీరుల్లో అగ్రగణ్యుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, కార్పొరేటర్‌ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ ఆవరణలో
భారత స్వాతంత్ర పోరాటానికి అల్లూరి సీతారామరాజు ఒక మార్గదర్శిగా నిలిచారని డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్‌.మూర్తి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జయంతిని మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి డిఆర్‌ఒ, అధికారులు నివాళులర్పించారు. డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్‌.మూర్తి మాట్లాడుతూ అతి చిన్న వయస్సులోనే దేశం కోసం త్యాగం చేసి స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చిన వ్యక్తిగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచి పోయారన్నారు. సీతారామరాజులోని నాయకత్వ లక్షణాలను, వారి త్యాగ స్ఫూర్తిని, దేశభక్తిని ఆదర్శంగా తీసుకో వాలని కోరారు. సమావేశంలో బిసి కార్పొరేషన్‌ ఇడి పుష్పలత, కలెక్టరేట్‌ ఎఒ రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా అల్లూరి జయంత్యుత్సవాలు
ముదినేపల్లి:అల్లూరి సీతా రామరాజు జయంతి వేడుకలు మంగళవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. రాజానగరంలోని ఆయన విగ్రహానికి కైకలూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మంగినేని బాబ్జీ, సుబ్బరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిడమరు : అల్లూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఎం మండల కన్వీనర్‌ నారపల్లి రమణరావు అన్నారు. భువనపల్లిలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో అల్లూరి జయంతిని నిర్వహించారు. అనంతరం కోన శీనివాసరావు అధ్యక్షతన. జరిగిన సభలో రమణరావు మాట్లాడారు. ఈ సభలో గవర సత్యనారాయణ, లావేటి చంద్రరావు, ప్రగడ మణికంఠ, మాణిక్యాలరావు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం:అల్లూరి త్యాగాలు చిరస్మరణీయమని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని నూతిరామన్నపాలెంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో ఎంఎల్‌ఎ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ అల్లూరి రత్నాజీ, ఆరేటి సత్యనారాయణ, కోవాస్‌ నారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు రామతులసి, ఎంపిపి కారం శాంతి, వైస్‌ఎంపిపి మోహన్‌రావు, సర్పంచి పోడియం లక్ష్మి పాల్గొన్నారు.
పోలవరం: బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని పోలవరం ప్రాజెక్టు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.విజయకుమార్‌ ఆన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా పోలవరం పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న అల్లూరి విగ్రహానికి సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఎస్‌.మల్లేశ్వరరావు, ఎఎస్‌ఐ కె.సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు, పురుషోత్తం పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : అల్లూరి జయంతి సందర్భంగా స్థానిక తహశీల్దర్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ సుందర్‌ సింగ్‌ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రమణ, విఆర్‌ఒలు అశోక్‌, తులసి, మాధురి, జూనియర్‌ అసిస్టెంట్‌ శాంతి, విఆర్‌ఎ షరీఫ్‌ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : అల్లూరి జయంతిని స్థానిక తొమ్మిదో వార్డు పర్రెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఎపియుసిఎఫ్‌ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పర్రెడ్డిగూడెం పాఠశాలలో నిర్వహించారు. ముందుగా పాఠశాల ఇన్‌ఛార్జి సాయిబాబు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ పట్టణ అధ్యక్షులు కెఎస్‌ నారాయణ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి షేక్‌ మాబుసుభాని, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి బి.యశ్వంత్‌, పట్టణ పౌర సమాఖ్య పట్టణ కార్యదర్శి వంగ గోపి, విద్యార్థులు పాల్గొన్నారు.
మండవల్లి : అల్లూరి పోరాట స్ఫూర్తి ఆదర్శమని పలువురు వక్తలు అన్నారు. భైరవపట్నంలో అల్లూరి జయంతి సందర్భంగా క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనుమూరి వాసురాజు, శ్రీహరిరాజు, సుబ్బరాజు, విశ్వనాథరాజు, సర్పంచి నేలపాల బుజ్జి, అడుసుమిల్లి, రాజారమణ పాల్గొన్నారు.
కైకలూరు : మహనీయులు అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహనరంగా వంటి నేతల అడుగు జాడల్లో యువత నడవాలని శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలో అల్లూరి, వంగవీటి జయంతులు నిర్వహించారు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. వైసిపి, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.