అల్లూరి దాడి చేసిన పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే
ప్రజాశక్తి-అడ్డతీగల
స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు దాడి చేసిన అడ్డతీగల పాత పోలీస్ స్టేషన్‌ను అల్లూరి పోరాటానికి ప్రధాన కేంద్రమైన అడ్డతీగల మండలం 'పైడిపుట్ట' ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. అడ్డతీగల పాత పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పాత పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 1922 అక్టోబర్ 14న అడ్డతీగల పోలీసు స్టేషనుపై దాడికి వ్యూహ రచన చేసి, 15వ తేదీన దాడి చేశారన్నారు. అనంతరం పడాల వీరభద్రరావు ఎమ్మెల్యే ధనలక్ష్మిని శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల ఎస్సై జి.అప్పలరాజు, సంఘం నాయకులు చీకట్ల శివన్నారాయణ, రామన శ్రీనివాసరావు, దంగేటి సత్తిబాబు, చోడిశెట్టి సుబ్బారావు, చెల్లూరి ప్రసాద్, సోమిరెడ్డి రాజు, అడ్డతీగల సర్పంచ్ పప్పుల చిట్టెమ్మ, వైస్ ప్రెసిడెంట్ ముప్పనశెట్టి శ్రీను, వైసిపి నాయకులు అడపా పెద్ద కాపు, నిమ్మల శ్రీను, రాజా రమేష్, రాజు ఎంపీపీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










