May 08,2023 00:09

అల్లూరి విగ్రహానికి పూలమాల వేస్తున్న నేతలు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతిని పురష్కరించుకొని కలక్టరేట్‌ ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలక్టర్‌ మాట్లాడుతూ, అల్లూరిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం పునరంకితం అవుదామని కలక్టర్‌ పిలుపు నిచ్చారు. బ్రిటిష్‌ వారిపై పోరాటం చేయడానికి వీలుగా పాపికొండలు ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకొని గిరిజనులను అల్లూరి చైతన్య పరిచారన్నారు. ఆదివాసులు, రైతులు, సానుభూతిపరులను సమీకరించి బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటాలలో నిమగమయ్యారని, పోలీస్‌ స్టేషన్లపై దాడి చేశారని, అతని వీరోచిత పరాక్రమాలను చూసి గిరిజనులు ''మన్యంవీరుడు'' గా కీర్తించారని కలక్టర్‌ వివరించారు. గిరిజనుల సంక్షేమం కోసం, బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు పేరుతో మనకు కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టర్‌ జే.శివ శ్రీనివాసు, డిఆర్‌ఓ పి.అంబేద్కర్‌ పాల్గొన్నారు.
పాడేరుటౌన్‌:మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఐటిడిఎ సమావేశ మందిరంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఐటిడిఎ ఎపిఒ వి.ఎస్‌.ప్రభాకరరావు, పరిపాలన అధికారి హేమలత పూల మాలలు వేసి నివాళుల్పించారు. ముందుగా ఐటిడిఎ ఆవరణలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ సిబ్బంది పాల్గొన్నారు.
డుంబ్రిగూడ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సంఘం మండల అధ్యక్షుడు కే సూర్యప్రకాష్‌, కార్యదర్శి ఎం.నవ సూర్య, నాయకులు అఖిల్‌, తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి:మండల కేంద్రంలోని గిరిజన సంఘం కార్యాలయం వద్ద అల్లూరి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. టోకురు సర్పంచ్‌ కిల్లో .మొస్య అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు, గిరిజన సంఘం మండల అద్యక్షుడు జె.సుబ్బారావులు పాల్గొన్నారు.