Jan 09,2023 22:50

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించి విద్యార్థులను, మహిళలను వేధించే అల్లరి మూకల ఆటలు కట్టించాలని ఐద్వా పశ్చిమ సిటీ అధ్యక్ష కార్యదర్శులు కుండనాల శేషుమణి, గాదె పాలవల్లి తెలిపారు. సోమవారం టూటౌన్‌, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సిఐలు సుబ్రహ్మణ్యం, సురేష్‌ రెడ్డిలకు ఐద్వా ఆధ్వర్యంలో మహిళలకు, విద్యార్థులకు రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50వ డివిజన్‌ గొల్లపాలెం గట్టు రోడ్డు పొట్టి శ్రీరాములు కాలేజీ ఎదురు అలాగే నైజాం గేటు, స్కూల్స్‌, కాలేజీలు మొదలగు ప్రాంతాలలో మద్యం, గంజాయి సేవించే అల్లరి మూకలు గ్రూపులుగా ఆటోలో కూర్చుని దారిలో పోయే మహిళల్ని స్కూల్‌ పిల్లలను అసభ్య పదజాలాలతో వేధిస్తూ అడ్రస్‌లు, ఫోన్‌ నెంబర్లు ఇవ్వమని వెంటపడుతున్నారని తెలిపారు. స్కూల్‌లో స్టడీ అవర్స్‌ పూర్తయ్యేసరికి చీకటి పడుతుండటంతో ఆడపిల్లలు ఇళ్లకు రావాలంటే భయపడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించి రాత్రి ఒంటిగంట వరకు ఏరియాలో అరాచకాలు సృష్టిస్తున్నారని, అలాగే వన్‌టౌన్‌ బ్రాహ్మణ వీధి అడ్డరోడ్డు ఉప్పర వాగు సెంటర్‌ వంటి ఏరియాల్లో కూడా ఎక్కువైపోతున్నారని, అదేమని అడిగిన వారిపై దాడులు చేస్తున్నారని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళలకు, విద్యార్థులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఆఫీస్‌ బేరర్స్‌ విక్రం లక్ష్మీ, కె, ఉష, ఎస్‌కె పాకిర, దుర్గ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.