Sep 23,2023 20:56

రెడ్డి పల్లె సమీపంలో నేలకు ఒరిగిన మొక్కజొన్న పంట.

ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లో భారీ వర్షం
- పొంగి ప్రవహించిన వాగులు, వంకలు
- నీట మునిగిన పంటలు - దెబ్బతిన్న రహదారులు
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ/రుద్రవరం

     ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లో శనివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆళ్లగడ్డ పట్టనంలోని ఎద్దుల పాపమ్మ కళాశాల మైదానం, ఆర్టీసీ గ్యారేజ్‌ వద్ద నీరు చేరాయి. రైతులు సాగు చేసిన మిరప, వరి, మినుము, పత్తి, జొన్న పంటలు నీట మునిగాయి. రైతులు కోత కోసి ఆరబోసుకున్న మొక్కజొన్న ధాన్యం తడిచిపోయింది. ఉయ్యాలవాడలో 6.5 సె.మీ, ఆళ్లగడ్డలో 6 సె.మీ వర్షపాతం నమోదయింది. ఆళ్లగడ్డ ప్రాంతంలోని వక్కిలేరు, కుందు, భవనాసి నదులకు భారీగా నీరు వచ్చి చేరింది. అలాగే గండ్లేరు రిజర్వాయర్‌ నీటితో కళకళలాడుతుంది. అహౌబిలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించాయి. చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. భారీ వర్షంతో ఎగువ అహౌబిలం పరిసర ప్రాంతాలు జలపాతాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
రుద్రవరం : రుద్రవరం మండలంలోని పలు గ్రామాలలో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దాదాపు 40.2 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మండలంలో మినుము, వరి, పత్తి, మిరప, జొన్న పంటలు నీట మునిగాయి. రైతులు కోత కోసి ప్రధాన రహదారులపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. ప్రధాన రహదారులు, కల్వర్టులు కోతకు గురయ్యాయి. మండలంలో గత రెండు రోజుల నుండి పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. గత శుక్రవారం తెల్లవారుజాము నుండి ఉదయం వరకు రుద్రవరం నుండి కోటకొండ మధ్యలోని గ్రామాలలో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం తెల్లవారుజాము నుండి ఉదయం వరకు రుద్రవరం నుండి ఆలమూరు పరిధిలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఆలమూరు గ్రామ సమీపంలోని అట్టెడ వాగు పొంగి ప్రవహించింది. ఆర్‌ నాగులవరం వద్ద వాగు ఉదృతంగా ప్రవహించి రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిప్పారెడ్డిపల్లె గ్రామం వద్ద రోడ్డుపై నీరు ఉదృతంగా ప్రవహించింది. దీంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వాహన రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలమూరు, చిత్రేణిపల్లె, ముకుందాపురం, హరినగరం, తండా, తిమ్మనపల్లె, నరసాపురం, ముత్తలూరు, తిప్పారెడ్డిపల్లె, లింగందిన్నె, ఆర్‌ నాగులవరం, రెడ్డి పల్లె, రుద్రవరం గ్రామాల పరిధిలో రైతులు సాగుచేసిన మిరప, పత్తి ,మినుము ,వరి జొన్న పంటలు నీటిమునుకకు గురయ్యాయి. మొక్కజొన్న పంట నేల వాలింది. భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో రుద్రవరం నుండి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేక ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాలలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా గ్రామాలలో ఒకవైపు పారిశుధ్యం లోపించి మరోవైపు కొత్తనీరు వచ్చి చేరి తాగునీరు కలుషితం అవుతుండడంతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రజలు రోగాల బారిన పడకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.