May 22,2023 21:35

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 'యువగళం'
- లోకేష్‌కు అడుగడుగునా ఘన స్వాగతం
ప్రజాశక్తి - చాగలమర్రి/ఆళ్లగడ్డ

     టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గంలోని దొర్నిపాడు క్యాంపు ఆవరణం నుండి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం కాగా నియోజకవర్గ యువ నాయకులు భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ఆధ్వర్యంలో భూమా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలను క్రేన్‌ సహాయంతో వేసి ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా యువనేతను చూసేందుకు జనం బారులు తీరారు. యువనేతను గజమాలలతో గ్రామాల్లోకి స్వాగతించారు. మహిళలు, రైతులు, వృద్ధులు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇస్తూ లోకేష్‌ ముందుకు సాగారు. పాదయాత్రకు బయలుదేరే ముందు దొర్నిపాడులో బలిజ సామాజిక వర్గీయులతో సమావేశమైన లోకేష్‌ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రారంభమైన పాదయాత్ర దొర్నిపాడు, రామచంద్రపురం, భాగ్యనగరం, చింతకుంట మీదుగా ఆళ్లగడ్డ శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. పాదయాత్రలో దొర్నిపాడు మండలం సమీపంలో రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయామని తమను ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. అలాగే నాగలిని నారా లోకేష్‌కు బహుకరించారు. పాదయాత్ర దారిలో వివిధ గ్రామాల ప్రజలు, ఉపాధి హామీ కూలీలు, కెసి కెనాల్‌ రైతులు యువనేతను కలిసి తమ సమస్యలు విన్నవించారు. 107వ రోజు లోకేష్‌ 14.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1378.1 కిలోమీటర్లు పూర్తయింది. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ఎంఎస్‌ అన్సర్‌ భాష, మండల కన్వీనర్‌ లాయర్‌ నరసింహారెడ్డి, నంద్యాల జిల్లా మైనార్టీ సెల్‌ నాయకులు కొలిమి హుస్సేన్‌ వలి, కొలిమి మహబూబ్‌ షరీఫ్‌, కొలిమి మాభాష, ముల్లా గఫార్‌, ముల్లా అజీమ్‌, ఆకుల ఇర్షాద్‌, ఆలంసా గారి ఖలీల్‌, బషీర్‌, మహబూలాల్‌, నాగూర్‌ భాష, కొలిమి షబ్బీర్‌, సత్యనారాయణ, చాంద్‌ బాషా, లాయర్‌ నరసింహారెడ్డి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్ర మంగళవారం జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లె వద్ద కడప జిల్లాలోకి ప్రవేశించనుంది.