పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి హత్య.. కైకలూరు నియోజకవర్గంలో అనుమతుల్లేకుండా యథేచ్ఛగా చెరువుల తవ్వకం, అంగన్వాడీల 36 గంటల నిరవధిక ధర్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రెండో దశ యాత్ర ఉమ్మడి జిల్లాలో అలజడి సృష్టించాయి.
బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి హత్య హాస్టళ్లలో వసతులను, భద్రతను తెరపైకి తీసుకొచ్చింది. పదో తరగతి విద్యార్థులే ఈ విద్యార్థిని హత్య చేసినట్లు పోలీసులు ప్రకటించినా సమస్య మాత్రం సద్దుమణగలేదు. ఇద్దరు సీనియర్ విద్యార్థులు నాలుగో తరగతి విదార్థిని పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం హత్య చేసేంత కారణాలేమిటీ, ఈ హత్యా ఘటనలో ఇతరుల ప్రమేయం ఏమీ లేదా?, వీరి ప్రవర్తనపై అటు వార్డెన్, ఇటు పాఠశాల సిబ్బందికి ఎవరికీ అనుమానం రాలేదా..? సహచర విద్యార్థులు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదా? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేకుండాపోయాయి. గతంలో జీలుగుమిల్లి మండలం దాట్లవారిగూడెంలో వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసును తర్వాత అటకెక్కించేశారు. ఈ తరహాలో గత పదేళ్లలో కెఆర్‌పురం ఐటిడిఎ పరిధిలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ వెలుగులోకి వచ్చినవే. రానివి ఎన్నో ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికైనా ఐటిడిఎ పరిధిలోని వసతి గృహాలన్నింటిపైనా పర్యవేక్షణ పెంచడంతోపాటు విద్యార్థుల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఘటన జరిగినప్పుడు హడావుడికన్నా అసలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పులిరామన్నగూడెం ఘటనను ఆధారంగా తీసుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని గిరిపుత్రులు కోరుతున్నారు.
ఆక్వా చెరువుల తవ్వకం జిల్లాలో మళ్లీ అలజడి సృష్టిస్తోంది. సారవంతమైన భూముల దగ్గర నుంచి నివాస ప్రాంతాలను దెబ్బతీసే వరకూ చేరుకున్న చెరువుల తవ్వకం తాజాగా తాగునీటి చెరువులను సైతం ధ్వంసం చేసేలా చేపట్టడం చర్చనీయాంశం కావడంతోపాటు ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితి ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఈ చెరువుల తవ్వకం వెనుక ఉండి నడిపిస్తుండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. కనీసం కోర్టు ఆదేశాలతో తవ్వుతున్నారని చెబుతున్నా.. ఆ ఆదేశాలు నిజంగా ఉన్నాయో లేదో మండలస్థాయి అధికారి చెప్పలేకపోవడం, జిల్లాస్థాయి అధికారులకు ఎటువంటి సమాచారమూ లేకపోవడం అధికార యంత్రాంగ నిస్సహాయతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కలిదిండి మండలంలో తాగునీటి చెరువు పక్కనే ఆక్వా చెరువు తవ్వకానికి బరితెగించారంటే ఎవరి అండ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు సైతం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండానే చెరువుల తవ్వకాలకు అనుమతులిచ్చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి కనీసం మనిషి జీవించడానికి అవసరమైన తాగునీరు, నివాసం వంటి వాటినైనా ఆక్వా చెరువుల తవ్వకాలతో ధ్వంసం చేయకుండా అడ్డుకట్ట వేయాలని అంతా కోరుతున్నారు.
అంగన్వాడీలు మరోసారి తమ పోరాట పటిమ చూపి అందరికీ ఆదర్శంగా నిలవడంతోపాటు భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి నింపారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 36 గంటల నిరవధిక ధర్నా చేపట్టిన వెంటనే స్పందించాల్సిన ప్రభుత్వం, జిల్లా అధికారులు సైతం మౌనం వహించడం చర్చనీయాంశమైంది. రెండో రోజు అంగన్‌వాడీలు కదంతొక్కుతూ కలెక్టరేట్ల వైపు దూసుకెళ్తుంటే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం తప్ప సమస్యలు తెలుసుకునే ప్రయత్నం జిల్లా అధికారులు చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది. భీమవరంలో అయితే పోలీసుల దురుసు ప్రవర్తనతో పలువురు గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయినా పట్టువీడక కలెక్టరేట్ వద్దకు చేరుకుని అధికారులు దిగొచ్చేలా చేసిన అంగన్‌వాడీల పోరాట పటిమ ప్రశంసనీయం. ఢిల్లీ రైతు పోరు, తాజాగా అంగన్‌వాడీల పోరు భవిష్యత్తు పోరాటాలకు దిక్సూచిగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రెండో దశ యాత్ర ఉమ్మడి జిల్లాలో ఆరు రోజులపాటు సాగింది. మొదటి దశ యాత్రకన్నా రెండో దశ యాత్రలో పవన్ ప్రసంగాలు అలజడి సృష్టించాయని చెప్పొచ్చు. వాలంటీర్లు డేటా సేకరణ, స్థానికాంశాలతోపాటు తణుకులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా ఇటు వాలంటీర్లు, అటు వైసిపి శ్రేణులు నిరసనలు చేపట్టి దిష్టిబొమ్మల దహనం వంటి చర్యలకు పాల్పడగా, జనసేన శ్రేణులు వాటిని తప్పుబడుతూ పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు పోటాపోటీగా నిర్వహించారు. ఈ అంశాలన్నీ ఇలా ఉండగా తణుకులో అన్నవరంలో అర్చకుల వేలం పాట గూర్చి ప్రస్తావిస్తూ ఇతర మతాల్లో ఇలా చేస్తారా అంటూ పవన్ ప్రశ్నించడం కలకలం సృష్టించింది. పవన్ జనసేనానిలా కాకుండా తన మిత్రులైన కాషాయదళ నేతలా మాట్లాడారనే విమర్శలు విన్పిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో వారాహి రెండో దశ యాత్ర కొంత అలజడి సృష్టించాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో మార్పులకు, జనసేనకు ఈ యాత్ర ఎంత వరకూ దోహదపడుతుందో వేచిచూడాలి.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్










