కోకిలొచ్చిన ప్రతిమారూ
కొత్తపాట ఆశించకు నేస్తం
మనసు శృతి
చేసుకోలేకపోయుండచ్చు
పరాజయం పాలైన
ప్రతి వారినీ
చిన్నచూపు చూడకు నేస్తం
ఆఖరి నిమిషంలో
ఆదమరపు కావచ్చు
కన్నీళ్ళను స్రవించే
ప్రతి వారిపై
జాలి కురిపించకు నేస్తం
నటనతో వలను
సిద్ధం చేసిన
వేటగాడు కావచ్చు
చిరునవ్వులద్దుకున్న ప్రతివారూ
ఆనందపు జల్లులో
తడుస్తున్నారని
ఊహించకు నేస్తం
లోపల లోతైన
అగాధాలు దాగుండవచ్చు
మొరటు మాటలు
విసిరే వారిని చూసి
మోసపోవద్దు నేస్తం
అంతరాలలో
మెత్తని హృదయం
ఇమిడి ఉండవచ్చు
మనసు స్పందించిన
ప్రతిమారూ
మంచి కవిత
మొలకెత్త లేకపోవచ్చు నేస్తం
అక్షరాలు పట్టుబడకపోవచ్చు
నువ్వూ నేనూ
కలిసిన ప్రతిసారీ
బోలెడు మాటలు
కలబోసుకోలేకపోవచ్చు
ఖాళీలను
కమ్మని క్షణాలతో
పూరించుకోవచ్చు
నీ మనసుకు
గాయమైన ప్రతిసారీ
నేను మాన్పలేకపోవచ్చు
ప్రేమతో కాసిని
ఓదార్పు మంత్రాలను
నీకు బహూకరించవచ్చు
ఒక చిన్న ధైర్యాన్ని
మదిలో విత్తుగా నాటవచ్చు
నిన్నో కొత్త మనిషిగా
అలంకరించి
నా గుండెల్లో దాచుకోవచ్చు
పద్మావతి రాంభక్త
99663 07777