Aug 08,2023 22:20

మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

* మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
* వైసిపి ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి
* టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - కోటబొమ్మాళి: 
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొస్తే జగన్మోహన్‌ రెడ్డిలా ప్రజలను మోసం చేయకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏ ఒక్క పథకం అమలు చేయకపోయినా గ్రామాలకు వచ్చినప్పుడు చొక్కా పట్టుకొని నిలదీయాలన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సుజాత అధ్యక్షతన టెక్కలి నియోజకవర్గ మహిళలతో మహిళా మహాశక్తి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అంతకుముందు మహాశక్తి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి అయినా ఐదేళ్లు పాలించిన తర్వాత అక్కడక్కడా కొంత వ్యతిరేకత ఉండడం సహజమని, జగన్మోహన్‌ రెడ్డికి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఉందన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా, పరిపాలన భాగస్వాములు చేసింది టిడిపి వ్యవస్థాపకులు కీ.శే ఎన్‌.టి రామారావు అని కాగా, చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు స్థాపించి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు అన్ని ఉద్యోగాల్లో అవకాశం కల్పించారని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకొచ్చాక మద్యపాన నిషేధంపై తొలి సంతకం చేస్తానన్న జగన్‌, ఆ హామీని నెరవేర్చకపోగా నాసిరకం మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పథకాలతో ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని గొప్పలు చెప్తున్నారని, నిత్యావసర ధరలు, విద్యుత్‌, బస్సు తదితర ఛార్జీలు పెంచి ప్రజల నుంచి తిరిగి దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, వైసిపి ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనన్నారు. టిడిపికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, కడప జిల్లా పులివెందులలో చంద్రబాబు పర్యటనకు పోటెత్తిన జనమే అందుకు ఉదాహరణ అని అన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షులు పూజారి శైలజ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల అధ్యక్షులు బోయిన రమేష్‌, బగాది శేషగిరి, పినకాన అజరుకుమార్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.