- టిడిపి హయాంలో పోర్టు, హార్బర్‌కు శంకుస్థాపన చేశారా?
- జగన్ శాశ్వత ముఖ్యమంత్రి
- రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి - పలాస: టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోర్టు గానీ హార్బర్ గానీ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గలోని ప్రగతి భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే, జగన్ ప్రభుత్వంలో రూ.16 వేల కోట్ల వ్యయంతో 44 వేల పాఠశాలలకు నాడు-నేడు కింద అభివృద్ధి చేశామన్నారు. టిడిపి హయాంలో వ్యవసాయరంగం 3.54 శాతం, పారిశ్రామిక రంగం 3.17 శాతం వృద్ధి చెందితే వైసిపి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం 11.27 శాతం, పారిశ్రామిక రంగం 12.80 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్రం ఎవరి హయాంలో అభివృద్ధి సాధించిందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని సువిశాల తీర ప్రాంతాన్ని, నదులను గత ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోలేకపోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.50 లక్షల మందికి, వైద్యరంగంలో 50 వేల మందికి ఉద్యోగాలను వైసిపి ప్రభుత్వం కల్పించిందన్నారు. రాష్ట్రంలో పది వేల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. టిడిపి హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా మళ్లీ అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్పడానికి టిడిపి నాయకులకు సిగ్గు కూడా లేదన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 93.50 లక్షలు, పలాస నియోజకవర్గంలో 26,400 ధ్రువపత్రాలను అందించామని చెప్పారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చూస్తుంటే, ఆ వ్యవస్థలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో సచివాలయ అధికారులు, వాలంటీర్లు ప్రజల వద్దకు వెళ్లి సేవలందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అవగాహన లేని పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారని చెప్పారు.










