
ప్రజాశక్తి-ఉయ్యూరు : కృష్ణాజిల్లా ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ఎన్‌సిసి కేడెట్‌కు అరుదైన గౌరవం లభించింది. ఎన్‌సిసి 16 (ఎ)బెటాలియన్ మచిలీపట్నం ద్వారా ఢిల్లీలో సెప్టెంబర్ 17 నుంచి 30వ తేదీ వరకూ జరిగిన ఎన్‌సిసి నేషనల్ క్యాంపు (ఆలిండియా తల్ సైనిక్ క్యాంప్)లో జెయుఒ అఖిలేష్ పాల్గొని బ్రాంజ్‌మెడల్ సాధించారు. మ్యాప్ రీడింగ్ కాంపిటేషన్‌లో ఆంధ్రప్రదేశ్-తెలంగాణా డైరెక్టరేట్ నుంచి అతడు విశేష ప్రతిభ కనబర్చాడు. దేశవ్యాప్తంగా 17 డైరెక్టరేట్ల పరిధిలోని కేడెట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మెడల్ సాధించిన అఖిలేష్‌ను విశ్వశాంతి విద్యాసంస్థల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యనిర్వాహక డైరెక్టర్ ఎం.సూర్యశేఖర్, సిఇఒ గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ కె.పద్మజావాణి, 16 (ఎ) ఆంధ్రా ఎన్‌సిసి బెటాలియన్ కెప్టెన్ (ఎఎన్‌ఒ సిపిటి) వేమూరి ఎలిజబెత్‌రాణిలు అఖిలేష్‌ను అభినందించారు. విశ్వశాంతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఎన్‌సిసి కేడెట్ల శిక్షణలు బాలుర, బాలికల విభాగంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి పాఠశాల, కళాశాల స్థాయిలో ఎన్‌సిసి ఆఫీసర్లు శిక్షణలు ఇస్తున్నారు. ఎంపికైన కేడెట్లకు చిన్న ఆయుధాలు, పరేడ్లలో ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తున్నారు. కార్ప్స్‌లో సాధించిన విజయాల ఆధారంగా ఆర్మీ, నేవీ,ఎయిర్ ఫోర్స్ ఎంపికల సమయంలో సాధారణ అభ్యర్థుల కంటే ఎన్‌సిసి సర్టిఫికెట్ పొందిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. ఎన్‌సిసి శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, లౌకిక దృక్పథం, సాహసం, క్రీడాస్ఫూర్తి, నిస్వార్థ సేవా భావాలు పెంపొందించబడుతున్నాయి. శిక్షణా సమయంలో విధ్యార్థులకు డ్రిల్, షూటింగ్, ఫిజికల్ ఫిట్నెస్, మ్యాప్ రీడింగ్, ఫస్ట్ ఎయిడ్, గ్లైడింగ్, ఫ్లయింగ్, బోట్ పుల్లింగ్, సెయిలింగ్‌తో పాటు క్యాంప్ ట్రైనింగ్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాలకు తగ్గట్లు ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తున్నామని వేమూరి ఎలిజబెత్‌రాణి తెలిపారు.