
శ్రామిక జనావళి ఆరోగ్య రక్షణకై నిరంతరం పరితపించిన డా||శ్యామలాంబ గారు...అత్యంత నిస్వార్థ సేవలతో...వైద్య విజ్ఞాన సేవకులందరికీ మార్గదర్శిగా చరితార్ధులయ్యారు. తల్లీబిడ్డల ఆరోగ్య రక్షణ లోను...తక్కువ ఖర్చుతో, సహజ సిద్ధంగా చిన్నారులను ఆరోగ్యంగా పెంచటం లోను... డా||శ్యామలాంబ గారి సలహాలు అత్యున్నత పథంలో విలసిల్లుతున్నాయి. వాటిని పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. పుస్తకంలో ఆమె పేర్కొన్న వైద్య సలహాలను ప్రజాశక్తి దిన పత్రికలో సీరియల్‌గా కూడా అచ్చువేశారు.
డా||శ్యామలాంబ గారు హైద్రాబాద్ లోని ప్రభుత్వ నిలోఫర్ హాస్పటల్‌లో సూపరెండెంట్‌గా పని చేసి రిటైరయ్యారు. రిటైరయ్యాక ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా వైద్య సహాయం కోసం పిల్లలనెత్తుకుని వచ్చిన పేద మహిళలకు వైద్యం అందించారు. రంగారెడ్డి జిల్లా, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కష్ట సుఖాలు అడిగి ఆదరంతో వారికి ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చి పంపేవారు.
ఇటీవల తన ఆరోగ్యం పాడయినా తల్లీపిల్లలకు వైద్య సహాయం అందిస్తూనే ఉన్నారు. ఆమె ఇల్లే రోగులకు వైద్య సహాయ కేంద్రంగా దేవాలయంగా నిలిచింది. దీనజనులందరికీ అమ్మ వలె నిలచి తన చివరి దశ వరకూ మానవ విలువలను చాటిన వైద్య విజ్ఞాన శాస్త్రవేత్త డా||శ్యామలాంబ గారు. తను పిల్లల వైద్య నిపుణురాలైనప్పటికీ... స్త్రీపురుషులకు ఏ రకమైన వ్యాధికైనా వైద్య సహాయం అందించేవారు.
ఆరోగ్య సమస్యలకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లోని మోటూరి ఉదయం ట్రస్టు భవనంలో మేం మెడికల్ క్యాంపులు పెడ్తే తప్పకుండా వచ్చేవారు. నేను కనిపిస్తే ముందుగా 'శారద ఎలాగుంది?' అని మా అమ్మాయి శారదను గురించి అడిగేవారు. శారద అంటే ఎందుకో తన బిడ్డ వలే అభిమానించేవారు.
వీరోచిత తెలంగాణ ప్రజా పోరాటంలో తెలంగాణ వీర యోధుల ఆరోగ్య రక్షణకై, పంజాబ్ నుండి వచ్చిన ప్రముఖ డాక్టరు తులి (సత్యపాల్ తులి) సొంత బిడ్డ వలె, చిన్న నాడే వైద్య సేవలలో రాటుదేలి, వైద్య విద్యార్థిగా వృద్ధి చెందారు శ్యామలాంబ. తన గురువు డా|| తులి కి దీటుగా వైద్య విజ్ఞానం పొంది ప్రముఖ వైద్యాధికారిగా ప్రభుత్వ నిలోఫర్ ఆస్పత్రిలో అత్యంత ఆదర్శవంతంగా ఆమె అందించిన సేవలను మరువలేం.
ఇటీవల ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించి నడవలేని, మాట్లాడలేని దశలో కూడా వైద్య సేవలు మానలేదు. ఆహారం లేదు. కొద్దిగా పండ్ల రసాలే తీసుకునేవారు. అయినా చక్రాల కుర్చీలో కూర్చుని రోగులను చూచి, వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని మందులు తెప్పించి ఇచ్చేవారు. తాను చెప్పాల్సిన సలహాలను కాగితం మీద రాసి ఇచ్చేవారు. ఇంట్లో భర్త, పనివాళ్లు ఎంత చెప్పినా వినకుండా...శుష్కించిపోయి, శల్యమైన పుల్ల లాంటి శరీరాన్ని తన మానసిక బలంతో చివర వరకూ, నిరుపేద దీన జనుల రక్షణకే నిలబెట్టిన మానవతా శక్తి ఆమె. సోషలిస్టు వ్యవస్థలో వికసించిన మానవ మేధా శక్తికి ప్రతిరూపం డా|| శ్యామలాంబ జీవితం.
నేను మొదటిసారిగా డా|| శ్యామలాంబను 1982 జూన్ 5వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చూశాను. నిలోఫర్ హాస్పటల్‌లో ఆపరేషన్ థియేటర్ గది గుమ్మం బయట ఆమె (అప్పటికి ఆమె డా||శ్యామలాంబ అని నాకు తెలియదు). లోపల ఆపరేషను డ్యూటీలో డా||మైత్రేయి. 'తల్లీ బిడ్డ కూడా బతకరు. ఇద్దరూ చనిపోతారు. తల్లి గర్భ సంచిలో ఇటువంటి కండిషన్ మేం ఎప్పుడూ చూడలేదు. కానీ ప్రయత్నం చేస్తాం' అన్నారు. అది మా పెద్దమ్మాయి సరోజ ప్రసవ సమయం. ప్రమాదం తెల్సుకుని అల్లూరి సత్యనారాయణ గారు అప్పటి సి.ఐ.టి.యు నాయకులు కె.భుజంగరావు గారింటికి వెళ్లి ఆయన సహాయంతో డా||శ్యామలాంబను కలిసి పరిస్థితి వివరించారు. ఆమె వెంటనే ఆస్పత్రికి వచ్చి డ్యూటీలో ఉన్న డా|| మైత్రేయికి తోడుగా నిలచి ఆపరేషను పూర్తి చేసి, అత్యంత చాకచక్యంతో తల్లీబిడ్డను క్షేమంగా మాకు అందించి ఆశ్చర్యపరిచారు. డా|| మైత్రేయి, మోటూరు ఉదయం గారమ్మాయి డా|| టాన్యా ఇద్దరూ ఒకే గదిలో ఉండి చదువుకొన్న డాక్టర్లు. టాన్యా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కల్సుకొనేవారు. మా ట్రస్టు బిల్డింగ్‌లో జరిగే మెడికల్ క్యాంపులకు కూడా వచ్చేవారు.
ఈ మధ్య ఒకసారి డా||శ్యామలాంబ గారింటికి ఫోన్ చేశాను. ఆమె భర్త బసవేశ్వరరావు గారే ఫోనులో పలికారు. 'డాక్టరు గారు... మీరు... ఎలాగున్నారండి?' అని అడిగాను. 'ఆమె మాట్లాడలేదు కదమ్మా' అన్నారు. మళ్లీ ఈ మధ్య ఒకసారి ఫోను చేశాను. బసవేశ్వరరావు గారు ఫోను ఆమెకే ఇచ్చారు. చాలా సన్నని స్వరంతో 'ఎలాగున్నారు?' అనడిగారు. 'అయ్యో మీకు ఓపిక లేదు మాట్లాడకండీ...' అన్నాను. అయినా ఏదో చాలా నెమ్మదిగా చెప్పారు. నాకు అర్ధం కాలేదు. అయినప్పటికీ ఆమె మానసిక శక్తి అద్భుతం. అమోఘం. స్త్రీ ఆదిశక్తి అన్నది సోషలిస్టు వ్యవస్థ లోని సోషలిజం. అదే రుజువు చేస్తూ సోవియట్ యూనియన్ ప్రభుత్వం ప్రపంచంలోకెల్లా మొదటిసారిగా ఒక స్త్రీని అంతరిక్షం లోకి పంపింది. అందుకు మార్క్సిజం ఇచ్చిన బలమే కారణం. అదే మార్క్సిజం ఇచ్చిన బలంతో డా||శ్యామలాంబ గారు ఆఖరి వరకూ అద్భుతంగా పనిచేశారు. 'సమాజంలో మెజారిటీ సంఖ్యగా ఉన్న శ్రామికుల సంక్షేమం, ఆరోగ్యం బాగుంటేనే జాతికి మనుగడ. వారి అభ్యున్నతి కోసం కృషి చేయండి'' అనే సందేశానికి ఉదాహరణగా తన జీవితాన్ని చూపిన ఆ మానవతామూర్తి అస్తమించారు. ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనే సమాజ సేవకులకు, అభ్యుదయ వాదులకు కర్తవ్యం కావాలని ఆశిస్తూ, వైద్య ఆరోగ్య సేవలలో ఆఖరిదాకా నిమగమైన డా|| శ్యామలాంబ జీవన మార్గానికి జేజేలు.
- అల్లూరి అమ్మాజీ