ఆర్‌ఎస్‌ఎస్ మార్కు హిందూత్వ సృష్టికర్త సావర్కార్ తప్ప అరవిందుడో వివేకానందుడో కాదు. హిందూత్వ పదం భావన సావర్కార్‌దే. ఆయన శిష్యుడైన గాడ్సే గాంధీని కాల్చి చంపడం చూస్తే దాని తత్వం తెలుస్తుంది. ఇప్పుడు దేశంలో లౌకికవాదుల పైన మేధావుల పైన ఆ దాడి కొనసాగుతూనే వుంది. ఎన్నికల్లో తాజాగా కూడా విజయం సాధించినా ఈ విద్వేషాలను ప్రజలు, ప్రతిపక్షాలు ఆమోదించడం లేదు. ఈ పరిస్థితుల్లో తమ మత రాజకీయాలతో మరోసారి ప్రజలను రెచ్చగొట్టడం అంత సులభం కాదు గనకే అఖండ భారత రాగం అవసరమైంది. మోహన్ భగవత్ అంటున్నట్టు వారు వేగం పెంచేలోగా లౌకిక ప్రజాస్వామిక శక్తుల వేగం పెరగడం మరింత అవసరం అవుతున్నది.
హిందూత్వ పేరిట దేశంలో మతతత్వ రాజకీయాలు రగిలించిన ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి కూటమి వచ్చే ఎన్నికల కోసం రోజురోజుకు మరిన్ని విపరీత పోకడలకు పాల్పడుతున్నది. ఆర్థిక సంక్షోభం, ఉపాధి-ఉత్పత్తి క్షీణత, కరోనా అనంతర ప్రభావాలు, ధరల పెరుగుదల, చార్జీల మోత వంటి వాటిని పక్కదోవ పట్టించేందుకు మతం ప్రాతిపదికన కృత్రిమ వివాదాలు రగిలించడం మోడీ హయాంలో నిత్యకృత్యమైంది. ఈ అసలైన సమస్యల బదులు హిజాబ్, హలాల్, ఆజమ్ వంటి వాటి చుట్టూ దేశం పరిభ్రమించేలా చేస్తున్నారు. గతంలో ఉత్తర భారతంలో గో రక్షణ పేరిట మూక హత్యలు జరిగితే ఇప్పుడు దక్షిణ భారతంలో వారి ఏకైక అధికార పీఠం కర్ణాటక వీటికి వేదికగా మారింది. సంస్కార వంటి చిత్రాలతో, గిరీష్ కర్నాడ్ వంటి రచయితలతో హెచ్.నరసింహయ్య వంటి హేతువాద వైస్‌ఛాన్సలర్లతో ఒకప్పుడు నవ కర్ణాటక అనిపించుకున్న ఆ రాష్ట్రం ఇప్పుడు మత చాందసానికి మారుపేరుగా తయారవుతున్నది. ఎ.పి, తెలంగాణ కూడా మినహాయింపులుగా లేవు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజరు తన సంగ్రామ యాత్రలో రోజూ ఇవే మాట్లాడుతున్నారు. హిందువులు పండుగలు జరుపుకోవడానికి ఆటంకాలు లేకుండా చేస్తామని లేనిపోని హామీలిస్తున్నారు. ఇక ఎ.పి లోనైతే ఆలయాలకు సంబంధించిన చిన్న పెద్ద సమస్యలు తీసుకుని హిందూ మతంపై దాడి జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. టిటిడి అనాలోచిత నిర్ణయాల వల్ల ఒకరోజు తొక్కిసలాట జరిగితే వెంటనే భక్తులను రాకుండా చేసే కుట్ర అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భారాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలను కదిలించడం కంటే హిందూ మతానికి ముప్పు వచ్చిందనే వాదనతో తేలికగా ఆకర్షించవచ్చునని బిజెపి నాయకత్వం అంతర్గత వ్యూహంగా వుంది. దురదృష్టవశాత్తూ ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, బిజెపి మిత్రపక్షమైన జనసేన కూడా హిందూ మతానికి ఏదో నష్టం జరుగుతుందనే ప్రచారానికి వంత పాడుతున్నాయి. పాలక వైసిపి అయితే తానే అసలైన హిందూ మత రక్షకురాలిననే ప్రచారం పనిగా పెట్టుకుంది. టిఆర్‌ఎస్ మతోన్మాద రాజకీయాలను ఖండిస్తున్నా ఆలయాల నిర్మాణం నుంచి యాగాల వరకూ తామే అసలైన హిందూత్వ వాదులమంటున్నది. మరోవైపు మజ్లిస్‌తో దానికి చెలిమి వుంది.
మతాలు, రాజ్యాంగం
ఈ పరిణామాలన్నీ మత రాజకీయాల సవాలు ముంగిట్లోకి వస్తున్న తీరుకు ఉదాహరణలు. మీడియా, సోషల్ మీడియాలు ఇందుకు ముఖ్య సాధనాలుగా దోహదం చేస్తున్నాయి. ఆన్‌లైన్ వాలంటీర్లనే వారు అచ్చంగా ఈ పని కోసమే నియమితులవుతున్నారు. పట్టణ మధ్యతరగతి భాషలో వారు మతతత్వ ప్రచారం చేయడమే గాక లౌకికవాదులపై ముఖ్యంగా కమ్యూనిస్టులూ ప్రగతిశీల మేధావులపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. ఎంటర్‌ప్రైజ్ హిందూత్వ అండ్ సోషల్ మీడియా అన్న అధ్యయనంలో ఇదొక క్రమపద్ధతిలో ఎలా వ్యాపింపచేస్తున్నదీ విదితం చేసింది. ఈ విష ప్రచారం యువతను, బడిపిల్లలనూ కూడా వదలడం లేదు. సిలబస్‌నే మార్చేస్తూ భగవద్గీత బోధన వరకూ తీసుకెళుతున్నారు. ప్రతిదీ మత కోణంలో చూపించే పాఠాలు ప్రవేశపెడుతున్నారు. భారత దేశంలో అత్యధిక శాతం హిందువులు గనక మెజార్టీవాదం అమలయ్యే హిందూ ప్రధాన దేశంగా రూపొందించాలనేది ఈ ప్రచారంలో ప్రణాళికలో ప్రధానాంశం. వినడానికి కొంత సమంజసంగా కనిపించే ఈ వాదం నిజానికి ప్రజాస్వామ్య మూల సూత్రాలనే పరిహసిస్తుంది. అల్ప సంఖ్యాకుల అభిప్రాయాలను స్వేచ్ఛను కూడా గౌరవించడమే ప్రజాస్వామ్యం. పైగా ప్రభుత్వాల మెజార్టీ మైనార్టీ అనేది ఓటింగును బట్టి నిర్ణయం కావాలి తప్ప మత విశ్వాసాలను బట్టి కాదు. భారత రాజ్యాంగం 25, 26, 27, 29 అధికరణలు అన్ని మతాల వారికి సమానత్వం కల్పించడమే గాక మైనార్టీలకు కొన్ని ప్రత్యేక రక్షణలిచ్చాయి. ఈ విషయమై ఎప్పటికప్పుడు అనేక తీర్పులు కూడా వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలలో హిందువులను మైనార్టీలుగా పరిగణించి సదుపాయాలు కల్పించడం తప్పు కాదని సుప్రీం కోర్టు గత నెలలోనే స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చింది. కనుక దేశంలో లేదా రాష్ట్రంలో ఒక మతం ఎక్కువగా వుంది గనక ఇతరులందరూ దానిలో లీనమై పోవాలని మాట్లాడ్డం ప్రజాస్వామ్యం కాదు. అలాగే ఏ మతం వారైనా ఇతర మతాలలోకి మారేందుకు రాజ్యాంగం అవకాశమిస్తున్నా అదేదో దేశ ద్రోహమైనట్టు చిత్రించడం, ప్రజలను నమ్మించడం మరో దుర్నీతి. మత మార్పిడి ఐచ్ఛికంగా జరగాలి తప్ప ప్రలోభాలతో కాదని చెప్పొచ్చు. కాని ప్రతి మత మార్పిడినీ కుట్రగా చిత్రించడం ఎలా చెల్లుబాటవుతుంది? ఆ మాటకొస్తే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్వయంగా బౌద్ధమతం స్వీకరించగలిగేవారా? వైదిక మతాలను బలంగా సవాలు చేసిన బౌద్ధ జైనాల వైపు వెళ్లిన దిగువ తరగతుల వారిని భక్తి ఉద్యమంతోనూ పైపై సమానతా సూక్తులతోనూ రాబట్టుకుని వుండకపోతే హిందూ మతం ఇంతగా విస్తరించేదా? ముస్లిం క్రైస్తవ మతాలను అనుసరించేవారంతా ఈ దేశం బిడ్డలు కాదా? ఏ మతమూ లేని అడవి బిడ్డల మాటేమిటి? ఆదివాసులను వనవాసులుగా చెప్పే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం వారికి వికాసాన్నిస్తుందా?
భిన్నత్వంలో ఏకత్వం
కనుక దేశాన్ని హిందూ మతానికి మాత్రమే పరిమితమైనట్టు చూపించడం రాజ్యాంగ ఉల్లంఘనే గాక ఈ దేశ చారిత్రక వారసత్వానికి, వైవిద్య సంస్కృతికి కూడా వ్యతిరేకమైన వ్యవహారం. భారతీయుల విశ్వాసాలు ఏనాడూ ఏక శిలా సదృశంగా లేవు. ఆ అవకాశం కూడా లేదు. మొఘలుల మాట అటుంచి...యవనులనబడే గ్రీకులు, పారశీకులనబడే పర్షియన్లు సహా కలిసిపోయారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ దేశ విశిష్టతగనకే జాతీయ పతాకంపైనా మూడు రంగులూ అశోక ధర్మచక్రం అలంకరించబడ్డాయి. ఆర్‌ఎస్‌ఎస్ పరివార్ ఈ వైవిధ్యాన్ని ఏనాడూ అంగీకరించింది లేదు. 'అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోరు' అన్న గురజాడ సూక్తి వారికి కంటకప్రాయం. హిందూత్వ పేరుతో ఓట్లు రాబట్టడమే వారి పథకం. సమత, సామాజిక న్యాయం ఊసే లేని నాటి వర్ణ వ్యవస్థ దొంతరలు, నేటి సంపదల అంతరాలు వారికి అవసరం. అందుకే హిందూత్వ అనేది ఆచరణలో కార్పొరేట్ కాషాయ కాక్‌టైల్‌గా తయారైంది. మోడీ ఎనిమిదేళ్ల పాలనలో దాని దుష్ఫలితాలను దేశం చూసింది. మిగిలిన వారికి లేని విధంగా ఈయనకు స్వంత మెజార్టి వుంది గనక, స్వయంగా ప్రచారక్‌గా వుండి ప్రధాని పీఠమెక్కారు గనక మోడీ హయాంలో పరివార్ దూకుడు మరీ హద్దుమీరింది. దేశ సరిహద్దులు కూడా దాటేస్తానంటున్నది.
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత నోటనే...
రవీంద్రపూరి అనే స్వామీజీ ఈ మధ్యనే మాట్లాడుతూ 2015 నాటికి అఖండ భారత్ సిద్ధిస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుందని చెప్పారట. ఆ తర్వాత అక్కడే మరో ఆలయ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆయనను పూర్తిగా బలపర్చారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆయన చెప్పారు గాని దేశంలో పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా వున్నాయని సెలవిచ్చారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని మరో 20-25 ఏళ్లలో అఖండ భారత్ సాధ్యమవుతుందని అన్నారు. మనం వేగంగా పనిచేస్తే అది 15 ఏళ్లకే నిజమైనా ఆశ్చర్యం లేదన్నారు. దూసుకుపోతున్న దేశం అభివృద్ధికి అడ్డుపడేవారిని తుడిచిపెడతామని హెచ్చరించారు. మంచివాళ్లను కలుపుకుంటాం, కొద్ది లోపాలున్నవారిని సరిదిద్దుతాం, అవరోధంగా మారేవారిని నిర్మూలిస్తాం అని బెదిరించారు (మిట్ జాయింగే). భారత్‌ది అహింసా సిద్ధాంతమైనా ఈ పని చేయడం కోసం అస్త్రాలు కూడా వున్నాయని ఆయుధ భాషలో మాట్లాడారు. నాతన ధర్మాన్ని నిర్మూలించడానికి వెయ్యేళ్లుగా ఎవరు ఎనిన ప్రయత్నాలు చేసినా విఫలమైనారనీ ఇక రాబోయే రోజుల్లోఅదే రాజ్యమేలుతుందని తిరోగమన రాగాలాలపించారు. ప్రజాస్వామ్య రాజ్యాంగం, లౌకికతత్వం సామాజిక న్యాయం ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ జయంతి సందర్భంలోనే ఆయన ఈ మాటలు మాట్లాడటం దేశంలో నెలకొన్న తలకిందులు పరిస్థితికి ప్రతిబింబం.
అనర్థదాయక నినాదం
అఖండ భారత్ ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మైన్మార్, టిబెట్, భూటాన్ వంటివన్నీ బారతదేశంలో భాగం కావాలని చెప్పే వివాదాస్పద విస్తరణ నినాదం. 'వీరసావర్కార్-దేశ విభజనను ఆపగలిగిన వ్యక్తి' అన్న పుస్తకం ఆవిష్కరణలో మోహన్ భగవత్ గతంలోనూ ఇలాంటి మాటలు మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్ ఉపఘనాధన్, దాని రాజధాని కాబూల్ కుజానగర్, పాకిస్తాన్ లోని పెషావర్ పురుష్‌పూర్, ముల్తాన్ అంటే మూలస్థాన్, టిబెట్ త్రివిష్టపం, మైన్మార్‌గా మారిన ఒకప్పటి బర్మా పేరు బ్రహ్మ దేశం. శ్రీలంక సరే సింహళం. ఇవన్నీ భారతీయులవేనట. సముద్రాల పేర్లు కూడా మార్చేశారు. అరేబియా సముద్రం అంటే సింధూ సాగర్, ఇండియన్ ఓషన్ హిందూ మహాసాగర్, బంగాళాఖాతం గంగాసాగర్. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల ప్రచురణల్లో ఈ పేర్లు మాత్రమే గాక మ్యాపులు కూడా వేశారు. ఉదాహరణకు 'విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్' నడిపే వేలాది పాఠశాలల్లో టీచర్లు ఇదే చెబుతుంటారు. సురుచి ప్రకాశన్ ప్రచురించిన పుణ్యభూమి భారత్‌లోనూ ఇదే తీరు. మోడీ వచ్చిన ఏడాదికే 2015 లోనే అప్పటి బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అల్‌జజీర్ ఛానల్‌తో అఖండ భారత్ గురించి చెప్పడం పెద్ద వివాదమైంది. కనక ఇదేదో అనుకోకుండా మాట్లాడింది కాదు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ విముక్తి గురించి దానిపై యుద్ధం గురించి బిజెపి నేతలు చాలాసార్లు మాట్లాడుతుంటారు. ఇన్ని దేశాలను కలుపుకోవాలనడం, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో వారికి తెలియదని కాదు. అది జరిగేపని కాదనీ తెలుసు. దేశాలు సరిహద్దులు జాతుల ప్రస్థానం అనేక మార్పులకు లోనైంది. మలుపులు తిరిగింది. 19, 20 శతాబ్దాలలో ఇవి చాలా వరకూ స్థిరపడ్డాయి. ఆప్ఘనిస్తాన్‌లో కాందహార్ ఒకప్పటి గాంధార దేశమనీ, కాంబోడియా అంటే కాంభోజ దేశమని చెబుతుంటారు. అయితే ఏవో పురాణాల ఆధారంగానో లేక పాతకాలపు కథలను బట్టో అవన్నీ మావేనని చెప్పుకోవడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కుదిరే పని కాదు, అనర్థదాయకమైన ఆ ఆలోచన అవసరం అంతకన్నా లేదు. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో కొన్ని ఇతర పాలక పార్టీలు కూడా బాధ్యతగా ఆలోచించి ఈ మత దురహంకార భాషణను ఖండించాల్సింది పోయి మామూలు తరహాలో ఎదురుదాడి చేస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముందు చైనా నుంచి భూభాగం స్వాధీనం చేసుకోవాలని వాదించడం ఇందుకో ఉదాహరణ. మహారాష్ట్రలో వారి భాగస్వామిగా వున్న శివసేన కూడా అదే మాట్లాడుతున్నది.
మోహన్ భగవత్ తన మాటలకు మద్దతుగా అరవింద యోగిని, వివేకానందుడిని తీసుకోవడం మరీ విడ్డూరం. ఆర్‌ఎస్‌ఎస్ మార్కు హిందూత్వ సృష్టికర్త సావర్కార్ తప్ప అరవిందుడో వివేకానందుడో కాదు. హిందూత్వ పదం భావన సావర్కార్‌దే. ఆయన శిష్యుడైన గాడ్సే గాంధీని కాల్చి చంపడం చూస్తే దాని తత్వం తెలుస్తుంది. ఇప్పుడు దేశంలో లౌకికవాదుల పైన మేధావుల పైన ఆ దాడి కొనసాగుతూనే వుంది. ఎన్నికల్లో తాజాగా కూడా విజయం సాధించినా ఈ విద్వేషాలను ప్రజలు, ప్రతిపక్షాలు ఆమోదించడం లేదు. ఈ పరిస్థితుల్లో తమ మత రాజకీయాలతో మరోసారి ప్రజలను రెచ్చగొట్టడం అంత సులభం కాదు గనకే అఖండ భారత రాగం అవసరమైంది. మోహన్ భగవత్ అంటున్నట్టు వారు వేగం పెంచేలోగా లౌకిక ప్రజాస్వామిక శక్తుల వేగం పెరగడం మరింత అవసరం అవుతున్నది.
తెలకపల్లి రవి











