Feb 24,2023 23:08

రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం
కార్పొరేషన్‌ రుణాల ఎత్తివేతతో బిసి, ఎస్‌సిలకు వైసిపి అన్యాయం
పోలవరంను సర్వనాశనం చేశారు
కార్యకర్తలే పార్టీకి సైన్యం, బలం
వచ్చే ఎన్నికల్లో నూటికి వెయ్యిశాతం గెలుపు మనదే
జోన్‌-2 నాయకులు, కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

              అధికారంలోకొచ్చాక ఆక్వా సాగుకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇచ్చి ఆదుకుంటామని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల జోన్‌-2 పరిధిలోని క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ లెవెల్‌, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం శుక్రవారం ఏలూరు బైపాస్‌రోడ్డులో నిర్వహించారు. సమావేశానికి రెండు జిల్లాల నుంచి దాదాపు మూడు వేల మంది వరకూ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై కార్యకర్తలు, నాయకులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓటర్ల జాబితా పరిశీలన, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, ఒకరికే రెండు ఓట్లు ఉండటం, నియోజకర్గంలో లేని వారి ఓట్లు గుర్తించి ఏం చర్యలు తీసుకోవాలో వివరించారు. పోలీసు కేసులను ఏవిధంగా ఎదుర్కోవాలి, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఫొటోలు ఏవిధంగా తీసి పంపాలి, లీగల్‌ సెల్‌తో ఏవిధంగా సంప్రదించాలో తెలిపారు. సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం ఏవిధంగా కోతలు పెడుతుందో, జనాలకు ఏవిధంగా నష్టం చేకూరుస్తుందో ప్రజలకు ఎలా వివరించాలో శిక్షణ ఇచ్చారు. యూనిట్‌ పరిధిలో ఉండే దాదాపు 1200 ఇళ్లకు సంబంధించి రోజుకు 40 ఇళ్లను కలవాలన్నారు. యూనిట్‌, క్లస్టర్‌, బూత్‌లెవెల్‌, కొత్తగా నియమిస్తున్న కుటుంబ సారధులంతా జనంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలన్నారు. అదే సమయంలో టిడిపి హాయాంలో అమలు చేసిన సంక్షేమం గురించి ప్రజలకు తెలియజెప్పాలో వివరించారు.
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: చంద్రబాబు
టిడిపికి కార్యకర్తలే వెన్నెముక అని చంద్రబాబు అన్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు శుక్రవారం ఏలూరు జరిగిన జోన్‌-2 సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఆక్వాసాగుకు యూనిట్‌కు రూ.రెండుకే ఇస్తామని, ఇప్పుడు జోన్‌, నాన్‌ ఆక్వాజోన్‌ పేరుతో రూ.4.50 చేశారన్నారు. టిడిపి అధికారంలో కొచ్చాక ఆక్వాకు యూనిట్‌కు రూపాయిన్నరకే విద్యుత్‌ ఇస్తామ న్నారు. మూడు, నాలుగు నెలలకు కూడా ధాన్యం డబ్బు వేయడం లేదని, అధికారంలోకొచ్చాక రైతులను అన్నివిధాలా అదుకుంటామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మీరు జనాలకు చెప్పగలిగితే వైసిపికి డిపాజిట్లు కూడా రావన్నారు. నూటికి వెయ్యిశాతం వచ్చే ఎన్నికల్లో టిడిపినే గెలుస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్రం, ఎన్నికల సంఘం, కోర్టుకు వెళ్లదామని తెలిపారు. వెను కబడిన తరగతులకు టిడిపి అండగా ఉంటుందని, అజెండా, మేనిఫెస్టో అదే ఉంటుందన్నారు. ఎస్‌సిలకు సంబంధించి 27 పథకాలను రద్దు చేశారన్నారు. కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వకుండా ఆపేశారన్నారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. 72 శాతం పూర్తి చేసిన పోలవరంను సర్వనాశనం చేశారన్నారు. ఒకొక్కరిపై రెండు లక్షల అప్పు ఉందన్నారు. వైసిపిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. జనంలో ఉన్నవారికే ఎంఎల్‌ఎ టిక్కెట్‌ ఇస్తామని, ఆవిధంగా చేద్దామా అంటూ కార్యకర్తలను చేతులెత్తి చెప్పాలనడంతో అంతా చేతులెత్తారు. ఇసుక, మైనింగ్‌ మాఫియా గురించి ప్రజలకు వివరించాలన్నారు. సంక్షేమం పేరుతో రూ.పది వేలు ఇచ్చి రూ.లక్ష లాగేస్తు న్నారని తెలిపారు. మద్యం ముసుగులో పెద్దఎత్తున దందా నడుస్తుందన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపో యాయన్నారు. టెక్నాలజీలో చాట్‌జిపిటిని ఉపయోగిం చాలన్నారు. వివేకా హత్య కేసులో టెక్నాలజీతో సిబిఐ జగన్‌ బండారం బయట పెడుతుందని తెలిపారు. పని చేసిన వారికే పార్టీ అధికారంలోకొచ్చాక పదవులు ఇస్తామన్నారు. ప్రభుత్వం జిఓ-1 తెచ్చి సమావేశాలు, సభలను అడ్డుకుం టుందన్నారు. నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలపై మాట్లాడించారు. కార్యక్రమంలో ప్రస్తుత ఎంఎల్‌ఎలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.