Dec 22,2022 21:47

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
           రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని, తద్వారా పౌషకార లోపాలు నివారించడంతో పాటు, ఆ రంగంపై ఆధారపడి ఉన్న లక్షలాదిమంది జీవనోపాధి కల్పించినట్లు అవుతుందని ఆక్వా ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షులు వి.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆక్వా ఉద్యోగుల అసోషి యేషన్‌ ఆరో వార్షికోత్సవం సందర్భంగా చేపలు, రొయ్యలు తినడం వల్ల కలిగే ప్రయో జనాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి సుమారు 80 మంది ఉద్యోగులతో గురువారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఫైర్‌ స్టేషన్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా సత్రంపాడు వరకూ విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ చేపలు, రొయ్యల్లో 22 నుంచి 80 శాతం వరకూ ప్రొటీన్స్‌, అనేక పోషకాలున్నాయని, అలాగే తేలికగా జీర్ణమయ్యే ఆహారం కావడంతో జీర్ణసంబంధ సమస్యలు రావన్నారు. 2021 శతాబ్దంలో పౌష్టికాహార లోపాలను నివారించగల ఏకైక ఆహారం చేపలు, రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తులేనని గ్రహించాలన్నారు. ఆక్వా నిపుణులు, ఎంజి ప్రతినిధి షోకాత్‌ అలీ మాట్లాడుతూ.. అమెరికా వంటి దేశాలు భారత దేశ రొయ్య ఉత్పత్తుల దిగుమతులు తగ్గించిందని, పొరుగు రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తుల పెంపకం పెరగడంతో ఇక్కడి ఆక్వా ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. దీంతో ఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, ఆధారపడ్డ రైతులు, టెక్నిషియన్లు, డీలర్లు, ట్రడర్స్‌, ఇతర వర్గాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చేపలు, రొయ్యల వినియోగం పెంచడానికి ప్రతిఒక్కరు కృలుషిచేయాలన్నారు. సంఘం ఉపాధ్యక్షులు శేషాసాయి, సెక్రటరీ వెంకట్‌ మాట్లాడుతూ చేపలు, రొయ్యలు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్‌ కుమార్‌, శ్యామ్‌, రాజు, వంశీ, డి.నానిబాబు, కుమార్‌ పాల్గొన్నారు.