Sep 20,2023 22:34

ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించాలి : కలెక్టర్‌

ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేలా అన్ని ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి తీసురావాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫిష్‌ ఆంధ్రా...ఫిట్‌ ఆంధ్రా నినాదంతో ఫిష్‌ హబ్‌ లను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష అన్నారు. బుధవారం తిరుపతి నగరంలో రాష్ట్రంలోనే మొదటి ఫిష్‌ ఆంధ్రా లాంజ్‌ కు శ్రీకారం చుట్టామని నగరపాలక మేయర్‌ డా.శిరీషా అన్నారు. బుధవారం ఉదయం స్థానిక మంగళం రోడ్డు, శ్రీరాం నగర్‌ వద్ద ఫిష్‌ ఆంధ్రా లో భాగంగా లబ్దిదారు భావనా జ్యోతి కొత్తగా ఏర్పాటు చేసిన ఫిష్‌ ఆంధ్రా లాంజ్‌ (చేపల అమ్మకం, రెస్టారెంట్‌ ) ను నగరపాలక మేయర్‌ శిరీష, జిల్లా కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి లు సంయుక్తంగా ప్రారంభిచారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల హెక్టార్‌ లలో ఆక్వా సాగు జరుగుతోందని, ఈరంగంపై మొత్తం 1.38 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారని , 2.27 మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే మనరాష్ట్రం మొదటి స్థానంలో వుందని అన్నారు. అలాగే మన జిల్లాలో 75 కిమీ సముద్ర తీర ప్రాంతం, 70 వేల మంది ఆక్వారంగం పై ఆధార పడివున్నారని అన్నారు. దాదాపు మన జిల్లాలో ఆక్వాసాగు చూస్తే 2381 హెక్టార్ల పైగా వుందని అన్నారు. మన తలసరి ఆక్వా ఉత్పత్తుల వినియోగం కేవలం 7 కేజీలు గా వుందని, అత్యంత పోషక విలువలు చేపలందు వున్నాయని, ఆరోగ్యవంతగా వుండాలంటే నిపుణుల సూచనలమేరకు కనీసం 25 కేజీల తలసరి వినియోగం రావాలని అన్నారు. భావనజ్యోతి మాట్లాడుతూ మహిళా కోటా కింద మంజూరు జరిగిందని, రూ.50 లక్షల యూనిట్‌ విలువ రూ.30 లక్షల సభ్సిడీ , రూ.1.50 లక్షల పెట్టుబడితో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణంగా రూ. 6.50లక్షలు అందిందని, తిరుపతి నగరంలో ఒక మంచి చేపలు, రొయ్యలు వంటివి అమ్మకంతో పాటు రెస్టారెంట్‌ ఏర్పాటు చేసామని ఆరోగ్యకర ఆక్వా ఉత్పత్తులను నేటినుండి అమ్మకాలు , రెస్టారెంట్‌ ప్రారంభించిన అందుబాటులోకి తీసురావడానికి ప్రోత్సహించిన అధికారులకు ధన్యవాదాలని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప మేయర్‌ ముద్రనారాయణ , జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్‌ , ఎస్‌.వి.యు ఆక్వాకల్చర్‌ హెడ్‌ నాగజ్యోతి, హబ్‌ ఆపరేటర్‌ రాజ రెడ్డి పాల్గొన్నారు.