Oct 25,2023 17:51

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
   ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఏలూరు పవర్‌ పేటలోని అన్నే భవనంలో ఆక్వా రైతుల సమస్యలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రైతుకు ఫీడ్‌ ధరలు తగ్గించడం, రొయ్యలు, చేపలకు ధరలు పెంచడం, విద్యుత్‌ సబ్సిడీని పునరుద్ధరించడం వంటి చర్యలను వెంటనే చేపట్టి ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే ఆక్వా రైతులు నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్‌ తయారీలో వాడే ముడి సరుకుల ధరలకు అనుగుణంగా ఫీడ్‌ ధరలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అంతర్జాతీయంగా రొయ్యల ధరలకు అనుగుణంగా రైతులకు ధరలు ఇప్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన యంత్రాలతో ఆక్వా ఫీడ్‌ మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. రైతులు పండించే రొయ్యలు విదేశాలకు ఎగుమతి చేయడంతో పాటు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అమ్మకం కేంద్రాలు తెరవాలన్నారు. ఫీడ్‌ కంపెనీలు, కెమికల్‌ కంపెనీలు వారి డీలర్లకు ఇచ్చే ధరకు, రైతులకు అమ్మే ధరకు ఎంఆర్‌పిలో చాలా వ్యత్యాసం ఉంటున్నదని, దీన్ని తగ్గించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన ధరలలో కోత పెట్టి ధరలు తగ్గించడం తగదన్నారు. 100 కౌంట్‌ రొయ్యలకు రూ.240 ధర అమలు చేయాలని తెలిపారు. చేపలకు మద్దతు ధరలు ప్రకటించి అమలు చేయాలన్నారు. ఆక్వా రైతుల ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.